Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఏ పెంచాలని రాష్ట్రవ్యాప్త నిరసన ప్రారంభం
కొల్కతా : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఎ పెంచాలని డిమాండ్ చేస్తూ పశ్చిమబెంగాల్ ఉద్యోగులు 48 గంటల పెన్‌డౌన్‌ను సోమవారం ప్రారంభించారు. పెన్డౌన్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులను లెక్క చేయకుండా ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య పోరాట వేదిక 'సంగ్రామి జౌతా మంచా' పిలుపుతో ఉద్యోగులు పెన్డౌన్లో పాల్గొంటున్నారు. రైటర్స్ బిల్డింగ్‌లోని వివిధ శాఖల ఉద్యోగులతో పాటు నూతన సచివాలయం, కోర్టులు, పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల ఉద్యోగులు పెన్డౌన్లో పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానితోపాటు సియురి, బీర్భూం, మేదినీపూర్, నదియా, మాల్దా, ముర్షిదాబాద్, హౌరా, హుగ్లీ తదితర జిల్లాల ఉద్యోగులు పెన్డౌన్లో పాల్గొన్నారు. 'కరువు భత్యం క్రమబద్ధీకరణ, అవినీతి రహిత నియామకాల కోసం పెన్‌డౌన్ చేస్తున్నాం. డిఎ మూడు శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మేం దిగ్భ్రాంతికి గురయ్యాం. మేం మా ఆందోళనను కొనసాగిస్తాం' అని ఉద్యోగులు చెప్పారు. ఉద్యోగులకు మూడు శాతం డిఎ పెంచుతున్నట్లు ఈ నెల 15న బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 'ఈ పెంపును మేం అంగీకరించం. మేం బిచ్చగాళ్లం కాదు. మా అర్హత ప్రకారం మేం డిమాండ్ చేస్తున్నాం. మేం వెనక్కి తగ్గం' అని ఉద్యోగులు తేల్చిచెప్పారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, గత కొన్ని రోజులుగా కోల్కత్తా నడిబొడ్డున ఉన్న షాహిద్ మినార్ గ్రౌండ్స్‌లో 'సంగ్రామి జౌత మంచా' బ్యానర్‌తో పలువురు ఉద్యోగులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.