Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మాజీ ఎంపీ టికె రంగరాజన్ కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) రాజ్యసభ జాన్ బ్రిట్టాస్ ఉత్తమ పార్లమెంటేరియన్‌గా సంసద్ రత్న అవార్డు వరించింది. అలాగే మరో సీపీఐ(ఎం) మాజీ ఎంపీ టికె రంగరాజన్ కు ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రశ్నలు, ప్రయివేట్ బిల్లులు, చర్చలలో పాల్గొనడం, జోక్యాలతో సహా పార్లమెంటరీ కార్యక్రమాలలో అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా సంసద్ రత్న అవార్డును అందజేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని జ్యూరీ ఈ అవార్డులను సోమవారం ప్రకటించింది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎస్ కృష్ణమూర్తి కో-చైర్మెన్‌గా ఉన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో ప్రారంభించిన పార్లమెంటరీ అవార్డును ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అమలు చేస్తోంది.
రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు సంసద్ రత్న అవార్డులకు ఎంపిక కాగా, మొదటగా జాన్ బ్రిట్టాస్ పేరు వచ్చింది. ఎంపీగా పనిచేసిన తొలి ఏడాదిలోనే బ్రిట్టాస్కి సంసద్ రత్న అవార్డుల జాబితాలో చోటు దక్కడం విశేషం. జాన్ బ్రిట్టాస్ (సీపీఐ(ఎం) కేరళ)తో పాటు మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ, బీహార్), ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్ (ఎన్సీపీ, మహారాష్ట్ర)లకు సంసద్ రత్న అవార్డులు సిట్టింగ్ సభ్యుల విభాగంలో లభించాయి. రిటైర్డ్ విభాగంలో ఎంపీలు విశ్వంభర ప్రసాద్ నిషాద్ (ఎస్పీ, ఉత్తరప్రదేశ్), చాయా వర్మ (కాంగ్రెస్, చత్తీస్‌గఢ్)కు అవార్డులు వరించాయి. లోక్‌సభ ఎంపీలు బిద్యుత్ బరన్ మహతో (బీజేపీ, జార్ఖండ్), సుకాంత మజుందార్ (బీజేపీ, పశ్చిమ బెంగాల్), కుల్దీప్ రారు శర్మ (కాంగ్రెస్, అండమాన్ నికోబర్ దీవులు), హీనా విజయకుమార్ గావిట్ (బీజేపీ, మహారాష్ట్ర), అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్), గోపాల్ చినయ్య శెట్టి (బీజేపీ, మహారాష్ట్ర), సుధీర్ గుప్తా (బీజేపీ, మధ్యప్రదేశ్), అమోల్ రామ్ సింగ్ కోలీ (ఎన్సీ, మహారాష్ట్ర)లకు సంసద్ రత్న అవార్డులు దక్కాయి.
సీపీఐ(ఎం) మాజీ ఎంపీ టికె రంగరాజన్ కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
సీపీఐ(ఎం) మాజీ ఎంపీ టికె రంగరాజన్‌కు ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. ఆయన రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారని జ్యూరీ తెలిపింది. స్టాండింగ్ కమిటీ విభాగంలో వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి చైర్మెన్‌గా ఉన్న రాజ్యసభ ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చరల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా చైర్మెన్‌గా ఉన్న లోక్‌సభ ఆర్థిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి అవార్డులు దక్కాయి. మార్చి 25న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డులను అందజేయనున్నారు.