Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణ ఊబిలో గుజరాత్ అన్నదాత
- ప్రతి రైతు కుటుంబానికి సగటున రూ.56వేల అప్పు
- బీహార్లోరూ.23వేలు.. ఛత్తీస్‌గఢ్‌లో రూ.21వేలు
- 40లక్షల కుటుంబాలకు వ్యవసాయమే ఉపాధి
- ఆదాయం కాదు.. అప్పులు రెండింతలు : నిపుణులు
దేశానికే మోడల్ గుజరాత్ రాష్ట్రమంటూ మోడీ మొదలుకుని బీజేపీ నేతలంతా తెగ ప్రచారం చేస్తారు. వాస్తవానికి అక్కడి దుర్భర పరిస్థితుల గురించి కానీ, దయనీయ బతుకుల గురించి కానీ ఎక్కడా చర్చల్లోకి రావు. పత్రికల్లోనూ కనిపించవు. ఎందుకంటే కార్పొరేట్ మీడియా గుజరాత్ లో దాగిన గుట్టు విప్పకుండా ..స్వామి భక్తి చాటుకుంటూ ఉంటోంది. గుజరాత్ లో కనిపించేదంతా మేడిపండు లాంటి అభివృద్ధేనని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా గుజరాత్ లో అన్నదాత అప్పుల్లో ఏ విధంగా కూరుకుపోతున్నాడో..సగటున అతని కుటుంబంపై ఎంత భారం ఉన్నదో.. తాజా గణాంకాల్లో తేటతెల్లమైంది.
న్యూఢిల్లీ : పెట్టుబడులు పెరిగాక సేద్యం భారమవుతోంది. అప్పులు తీసుకుని పంట వేస్తే గిట్టుబాటు ధరరాక అన్నదాత అల్లాడిపోతున్నాడు. మరోవైపు తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకులు డప్పు వేయిస్తూ ఆస్తులకు వేలం వేస్తున్నాయి. ఇక దేశానికే గుజరాత్ మోడల్ అంటూ చెప్పుకుంటుంటే.. మరోవైపు మిగతా రాష్ట్రాలతో పోల్చితే గుజరాత్ రైతాంగం అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నదని కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత వెనుకబడిన రాష్ట్రాలుగా భావించే బీహార్, ప.బెంగాల్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్..తదితర రాష్ట్రాలు..గుజరాత్ కన్నా మెరుగ్గా ఉన్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల విడుదల చేసిన 2021-22 నివేదిక ప్రకారం, గుజరాత్లో 66 లక్షల 2 వేల 700 వ్యవసాయ కుటుంబాలు న్నాయి. ఇందులో 40 లక్షల 36 వేల 900 కుటుంబాలకు వ్యవసాయ పనులే ఆధారం. రాష్ట్ర జనాభాలో 61శాతం కుటుంబాలకు వ్యవసాయమే ఉపాధి చూపుతోంది. రైతు కుటుంబాలు కలిగివున్న సగటు భూమి కేవలం 1.4 ఎకరాలు. సగటు భూమి విషయంలో గుజరాత్ దేశంలో 10వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై రూ.56,568 అప్పు ఉంది. ఇదే విషయమై బీహార్‌లో సగటు అప్పు రూ.23వేలు, ప.బెంగాల్లో రూ.26వేలు, ఒడిషాలో రూ.32వేలు, ఛత్తీస్‌గఢ్‌లో 21వేలు, ఉత్తరాఖండ్‌లో రూ.48వేలుగా ఉన్నదని నివేదిక తెలిపింది.ఆదాయంలోనూ బీహార్, ప.బెంగాల్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్లకన్నా గుజరాత్ ఎంతగానో వెనుకపడింది. సగటున ఒక రైతు కుటుంబానికి వస్తున్న పంట ఉత్పత్తి ఆదాయం రూ.4318. పశువులపెంపకంపై రూ.3477, కూలి పనులతో రూ.4415, భూమిపై కౌలు ఆదాయం రూ.53..మొత్తం సగటు నెల ఆదాయం రూ.12,631గా ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే, అధికార బీజేపీ చెప్పేది మరోలా ఉంది. వ్యవసాయరంగంలో దేశానికి నాయకత్వం వహించే స్థాయిలో గుజరాత్ ఉందని బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది.
అప్పులు రెండింతలు : హేమంత్ షా, ఆర్థికవేత్త
రైతుల అప్పుల్లో పెరుగుదలను గమనిస్తే, వారు ఎంతటి సమస్యల్లో ఉన్నారన్నది అర్థమవుతోంది. పెరిగిన అప్పులకు అనుగుణంగా వారి ఆదాయం పెరగలేదు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రస్తుత పాలకులు ఎన్నో వాగ్దానాలు చేశారు. తాజా డాటా ప్రకారం రైతు రుణాలు రెండింతలు అయ్యాయి. రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం.
భారీగా పెరిగిన సాగు వ్యయం : రాజేంద్ర ఖిమానీ, వైస్ ఛాన్స్లర్, గుజరాత్ విద్యాపీఠ్
పంట సాగు వ్యయం విపరీతంగా పెరిగింది. దీనికి అనుగుణంగా పంట చేతికొచ్చాక..వాటికి కనీస మద్దతు ధర లభించటం లేదు. దాంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. అప్పుల్లో కూరుకుపోతున్నాడు. ఇన్పుట్ ధరలు గత మూడేండ్లలో 60శాతం పెరిగాయి. పంట ఉత్పత్తి ధరలు కనీసం 30శాతం కూడా పెరగలేదు. సాగు ఖర్చులు, పంట అమ్మకం ధరకు మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంది. ఆహార పంటలు (వరి, గోధుమ, పప్పుదినుసులు) కాకుండా వాణిజ్య పంటలైన పత్తి, పొగాకు, కాఫీ, నూనె గింజలు, చెరుకు సాగు చేయటానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ శక్తులు వ్యవసాయరంగాన్ని శాసించటం మొదలైంది. రైతుల అప్పులు పెరగటానికి ఇది కూడా ఒక కారణం.
గతంలో తీసుకున్నవి తీర్చలేకపోతున్నాం : రమేష్ పటేల్, దక్షిణ గుజరాత్‌కు చెందిన రైతు
ఎరవుల ధరలు పెరిగాయి. విత్తనాల ధరలు రెండింతలు అయ్యాయి. వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లకు వినియోగించే డీజిల్ ధర విపరీతంగా పెరిగింది. ఇన్పుట్ ఖర్చులు భారీగా పెరగటంతో రైతుల ఆదాయం తగ్గింది. గతంలో తీసుకున్న అప్పులు తీర్చడానికే రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
సాగు రుణాలు రూ.96,963 కోట్లు
పార్లమెంట్‌కు సమర్పించిన డేటా ప్రకారం, గుజరాత్లో వ్యవసాయ రుణాలు 2019-20లో రూ.73,228 కోట్లు. 2021-22 నాటికి రూ.96,963 కోట్లకు చేరుకున్నాయి. రెండేండ్లలో క్రెడిట్ ప్రోగ్రాం కింద రుణాల పరిమాణం 45శాతం పెరిగింది. ఒక్కో బ్యాంక్ ఖాతాలో రుణం రూ.1.7 లక్షల నుంచి రూ.2.48లక్షలకు చేరుకున్నది.