Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికీపీడియాను ఏమార్చిన అదానీ గ్రూప్ : ది సైన్‌పోస్ట్ లో కథనం
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మరోసారి అడ్డదారిలో వికీపీడియాను ఏమార్చినట్టు తెరపైకి వచ్చింది. తమ కంపెనీల షేర్లకు ఆ గ్రూప్ కృత్రిమ డిమాండ్ సృష్టించిందన్న హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రకంపనలు ఇంకా చల్లారకముందే మరో వివాదం అదానీ గ్రూప్ మెడకు చుట్టుకున్నది. వికీపీడియాలోని సమాచారాన్నీ ఏమార్చారన్నది తాజాగా వెలుగుచూసింది. గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు, గ్రూప్ కంపెనీలకు సంబంధించి పక్షపాతంతో కూడిన కంటెంట్‌ను యాడ్ చేశారనీ, వికీలో హెచ్చరికలనూ తొలగించారని వికీపీడియా ఆరోపించింది. ఇందుకోసం తోలుబొమ్మ ఖాతాలను, పెయిడ్ ఎడిటర్లను వినియోగించారని పేర్కొంది. ఇలా కంటెంట్‌లో మార్పు చేసిన వారిలో అదానీ గ్రూప్ కంపెనీ ఉద్యోగులూ ఉన్నారని తెలిపింది. ఈ మేరకు వికీపీడియాకు చెందిన న్యూస్ పేపర్ ది సైన్‌పోస్ట్ ఓ కథనం ప్రచురించింది.
అదానీ కుటుంబం, అదానీ కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన సమాచారాన్ని ఏమార్చినట్టు వికీపీడియా తెలిపింది. పక్షపాతంతో, పొగుడుతూ కూడిన కంటెంట్‌ను జొప్పించారని ఆరోపించింది. అదానీ గురించి 2007లో ఆర్టికల్స్ మొదలయ్యాయనీ, అవన్నీ ముక్కుసూటిగా ఉండేవని వికీపీడియా తెలిపింది. 2012లో ముగ్గురు ఎడిటర్లు దానికి సంబంధించిన కంటెంట్‌లో మార్పులు చేశారనీ, వార్నింగ్ టెక్స్ట్‌ను సైతం తొలగించారని ఆరోపించింది. ఇలా 9 ఆర్టికల్స్‌ను రూపొందించిన/ సవరించిన 40 మంది పెయిడ్ ఎడిటర్లు, సాక్పప్పెట్స్ను బ్లాక్ చేసినట్టు వికీపీడియా తెలిపింది. ఇలా ఎడిట్ చేసిన వారిలో అదానీ గ్రూప్ కంపెనీ ఉద్యోగులూ ఉన్నారని పేర్కొంది. అదానీ గ్రూప్ ఐపీ అడ్రస్‌లు గుర్తించినట్టు తెలిపింది.
''అదానీ గ్రూప్‌నకు చెందిన ఓ పెయిడ్ ఎడిటర్ ఆ కంపెనీకి సంబంధించి ఆర్టికల్‌నే పూర్తిగా మార్చివేశారు. ఇదంతా అదానీ గ్రూప్ ఐపీ అడ్రస్ నుంచే జరిగింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన వార్నింగ్‌లను కూడా తొలగించారు. వికీపీడియా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్‌కు సైతం దొరక్కకుండా కొన్ని ఆర్టికల్స్‌ను రూపొందించారు'' అని వికీపీడియా పేర్కొంది. ఇలాంటి ఆర్టికల్స్‌ను రివ్యూ చేసేందుకు ఉన్న రివ్యూయర్ అయిన హాచెన్స్ తన స్థానాన్ని దుర్వినియోగం చేశారనీ, అతడిపై నిషేధం విధించామని వికీపీడియా పేర్కొంది. అదానీకి సంబంధించి తొమ్మిది ఆర్టికల్స్‌లో ఏడింటిని ఆయన ఆమోదించారనీ, అవినీతికి పాల్పడి ఈ పని చేసి ఉండొచ్చని పేర్కొంది. వికీపీడియాలో వచ్చిన ఈ కథనాన్ని హిండెన్‌బర్గ్ రీసెర్చి వ్యవస్థాపకుడు నాథే ఆండర్సన్ ట్వీట్ చేశారు. వికీపీడియాను సైతం ఏమార్చారంటూ ఆయన పేర్కొన్నారు. వికీపీడియాలో గతంలోనూ పలువురు బిలీయనీర్లు ఇలా పెయిడ్ ఎడిటింగ్‌లకు పాల్పడ్డ ఉదంతాలు ఉన్నాయని ఈ సందర్భంగా వికీ తెలిపింది. ఈ ఆరోపణలపై ఇప్పటివరకూ అదానీ గ్రూప్ స్పందించలేదు.