Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యసభ నిబంధనలు
- ఓట్ల కోసం బీజేపీ మత ఘర్షణలు :సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : ఓట్ల కోసం బీజేపీ మత ఘర్షణలకు పాల్పడుతోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మంగళవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం రాష్ట్రాల్లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. కేవలం కేరళలో మాత్రమే కాదనీ, దేశంలోని అన్ని బీజేపీయేతర రాష్ట్రాల్లో బీజేపీ మతఘర్షణలకు పాల్పడుతోందని అన్నారు. మత ఘర్షణలపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా కేంద్ర ప్రభుత్వంగాని, ప్రధాని మోడీగాని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదని ఏచూరి విమర్శించారు. పైగా ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు కళంకం అంటగట్టడంలో బీజేపీ మాత్రమే ఎక్స్పర్ట్ అని ఆయన ఎద్దేవా చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యసభ నిబంధనలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ చైర్మన్ అనుసరించిన తీరుపై కూడా ఏచూరి విమర్శలు చేశారు. అదానీ అవినీతిపై సభలో చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు రూల్ నెంబర్ 267 కింద తీర్మానాలు సమర్పించడంపై రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. సభ్యులు ప్రతిరోజు నోటీసులు ఇచ్చారని తన ఫిర్యాదులో పేర్కొన్నారని అన్నారు. సభ్యులు రోజూ నోటీసులిస్తున్నారని రాజ్యసభ చైర్మెన్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఎంపీలు రోజూ తీర్మానాలు ఇవ్వవచ్చని రాజ్యసభ నిబంధనలే చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.