Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చేది కాంగ్రెస్ పాలనే : ఖర్గే
కొహిమా : వందమంది మోడీ, షాలు అడ్డుపడినా కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ప్రజాస్వామ్యయుత పాలనను అడ్డుకోలేరని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ వరుస దాడులను చేస్తూ రాష్ట్రాలను దోచుకుంటోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాగాలాండ్‌లోని చుమౌకెడిమాలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. గత 20 ఏండ్లుగా నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీ నాగాలాండ్‌ను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రజలకు న్యాయం జరగాలనీ, ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వం రావాల్సిన సమయం అసన్నమైందన్నారు. నాగాల విశిష్ట సంస్కృతిని నాశనం చేయడమే లక్ష్యంగా బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. మీ సంస్కృతిపై జరుగుతున్న దాడిని, విద్వేషాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు పోరాటం చేయాలని సూచించారు. అలాగే ఆపరేషన్ కమలం పేరిట బీజేపీ పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేయడాన్ని కూడా ప్రస్తావించారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కర్నాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌లలో ప్రభుత్వాలను కూల్చివేసిందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించిందని, కానీ బీజేపీ 17-18 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిందని వివరించారు. అప్రజాస్వామ్య చర్యలు చేపడుతూ... బీజేపీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. 2024లో ప్రజలు మోడీకి గుణపాఠం చెబుతారనీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.