Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అరెస్టు... ఉద్రిక్తత
- రన్‌వేపై బైటాయించిన కార్యకర్తలు..
- బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : మోడీపై వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై. కాంగ్రెస్ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పవన్ ఖేరాను రారు పూర్ వెళ్లకుండా ఢిల్లీ విమానాశ్రయ అధికారులు గురువారం అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రన్‌వేపై విమానం పక్కనే బైటాయించారు. బోర్డింగ్ పాస్ సహా అన్ని పత్రాలు ఉన్నప్పటికీ... పవన్‌ఖేరాతో పాటు పార్టీ నేతలను విమానం ఎక్కిన కాసేపటికే ఇండిగో విమానం నుంచి బలవంతంగా దింపేశారు. వీరంతా రారుపూర్‌లో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసీసీ) సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు అసోం పోలీసులు విమానాశ్రయానికి చేరుకున్నట్టు సమాచారం. ప్రధాని మోడీని అవమానించారంటూ ఓ బీజేపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ఖేరాపై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసు అధికారులు తెలిపారు.
ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆయనను అడ్డుకున్నట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన వర్గాలు తెలిపాయి. పోలీసులు వచ్చారని, లగేజీ సమస్య ఉన్నదని అన్నారనీ, డిప్యూటీ కమిషనర్ మిమ్మల్ని కలుస్తారని చెప్పారని పవన్ ఖేరా పేర్కొన్నారు. అయితే అరెస్ట్ వారెంట్ లేనప్పటికీ పవన్ఖేరాను విమానం నుంచి దింపేశారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీ సమావేశానికి రాకుండా అడ్డుకునేందుకు పవన్ ఖేరాను విమానం నుంచి బలవంతంగా దింపేందుకు మోడీ ప్రభుత్వం గూండాల్లా వ్యవహరించిందని మరో కాంగ్రెస్ నేత కె.సి. వేణుగోపాల్ మండిపడ్డారు. వారిపై ఎఫ్ఐఆర్లను ఉపయోగించడం సిగ్గుచేటని, ఆయోదయోగ్యం కాని చర్య అని అన్నారు. పార్టీ పవన్‌ఖేరాకు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. కాగా ఈ ఘటనలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ మంజూరుతో ఖేరా విడుదల కానున్నారు..