Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శుక్రవారానికి వాయిదా
న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్ ఎన్నిక ముగిసినప్పటికీ.. ఆప్, బీజేపీ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీని ఎన్నుకునేందుకు గురువారం అసెంబ్లీలో కౌన్సిలర్లు సమావేశమైన కొద్దిసేపటికే సభ రసాభాసగా మారింది. అర్థరాత్రి హైడ్రామా నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. ఎంసీడీ మేయర్గా ఎన్నికైన ఆప్ సభ్యురాలు షెల్లీ ఒబెరారు సభ్యుల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుండగా.. బీజేపీ కౌన్సిలర్లు దాడికి దిగారు. కౌన్సిలర్లు కేకలు వేస్తూ, ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. రేఖా గుప్తా మైక్ లను ధ్వంసం చేశారు. మరికొందరు నీళ్ల బాటిళ్లు, యాపిల్ పళ్లతో పాటు చివరికి బ్యాలెట్ బాక్సులను కూడా విసిరికొట్టారు. కొందరు ఘర్షణ పడుతుంటే.. ఇంకొందరు వీడియోలు తీశారు. దీంతో కౌన్సిల్ కార్యకలాపాలు బుధవారం సాయంత్రం నుంచి ఎనిమిదిసార్లు వాయిదా పడుతూ.. గురువారం కౌన్సిల్ రద్దయింది. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహిస్తుంటే.. బీజేపీ కౌన్సిలర్లు తనపై దాడి చేసేందుకు యత్నించారని ఢిల్లీ మేయర్ ట్వీట్ చేశారు. బీజేపీ సభ్యుల తీరు సిగ్గుచేటని, అది వారి గుండాగిరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజలు తమను విశ్వసించారని, క్రాస్ ఓటింగ్ కు తాము భయపడటం లేదని అన్నారు. బీజేపీ ఓటమి పాలైందని.. అందుకే వారు భయపడుతుండవచ్చని ఎద్దేవా చేశారు. బీజేపీ కౌన్సిలర్ల ప్రవర్తన దిగ్భ్రాంతిని కలిగించిందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు.