Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ మద్యం కేసులో...
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బిభవ్ కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కేసులో దర్యాప్తును ఎదుర్కొంటుండగా.. తాజాగా ఈ సెగ ముఖ్యమంత్రిని తాకింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ఈడీ, సీబీఐ వేర్వేరుగా విచారణలు జరుపుతున్నాయి. తాజాగా మరోసారి సిసోడియాకు సమన్లు ఇచ్చింది. వచ్చే ఆదివారం ఆయన అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇప్పుడు ఈ కేసులో కేజ్రీవాల్ పీఏను ఈడీ ప్రశ్నించింది. బిభవ్ కుమార్‌ను న్యూఢిల్లీలోని ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ముందు ప్రశ్నించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం దర్యాప్తు అధికారులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారని అధికారులు తెలిపారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బిభవ్ కుమార్‌తో సహా కనీసం 36 మంది నిందితులు 170 ఫోన్లను ధ్వంసం చేశారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. ఈడీ ఇప్పటి వరకు ఈ కేసులో రెండు ఛార్జ్షీట్లు, ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను దాఖలు చేసింది. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత వద్ద చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేసిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ ఇటీవల ఈ కేసులో అరెస్ట్ చేసింది. విజరు నాయర్, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా రెడ్డి, బినయ్ బాబులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.