Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ, అంబానీ, టాటాల సేవలో కేంద్రం
- భారీ ప్రాజెక్టులు..లక్షల కోట్ల సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు
- ఇవన్నీ ఊరకే కాదు.. దీని వెనుక రాజకీయ లబ్ది ఉంది : రాజకీయ విశ్లేషకులు
- వాట్సాప్‌ను వాడుకోవాలనే రిలయన్స్ జియోకు ప్రోత్సాహం
- వేదాంత గ్రూప్‌నకు రూ.1.6లక్షల కోట్లు సబ్సిడీలు
న్యూఢిల్లీ : బడా కార్పొరేట్ కంపెనీలపై మోడీ సర్కార్ మోజు రోజు రోజుకీ పెరుగుతోంది. ఎన్నో కుంభకోణాలు, బ్యాంక్ దివాలాలూ ఉన్నా వాటిని కేంద్రం అక్కున చేర్చుకుంటోంది. పరస్పర ప్రయోజనాలు ఉన్నందునే బడా కార్పొరేట్లకు పెద్ద ఎత్తున సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు దక్కుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన సాంసంగ్, హ్యుందారు, ఎల్జీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న సంస్థలు. దక్షిణ కొరియా రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నాయన్న ఆరోపణలు ఈ సంస్థలపై ఉన్నాయి. ఇలాంటి వ్యాపార సామ్రాజ్యాల్ని మన దేశంలోనూ తీసుకురావాలని మోడీ సర్కార్ ఉవ్విళ్లూరుతోంది.అంబానీ, అదానీ, టాటా, వేదాంత గ్రూప్‌లతో కేంద్రం కలిసి పనిచేస్తోంది. ప్రజలు ఇచ్చిన పన్నుల ఆదాయంతో ఈ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల విలువజేసే సబ్సిడీలు దక్కుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా మోడీ ప్రభుత్వం ఈ వ్యాపార సామ్రాజ్యాలకు 'నేషనల్ ఛాంపియన్స్' అనే ముద్దు పేరును తగిలిస్తోంది.
ఆధారపడ్డామా..ఇక అంతే
కుటుంబ వ్యాపార సంస్థలు, బడా కార్పొరేట్ కంపెనీలతో పాలకులకు రాజకీయంగా అనేక ప్రయోజనాలు న్నాయి.అందువల్లే బడా కార్పొరేట్ కంపెనీలకు పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్నారు. బ్యాంకుల ద్వారా అత్యంత తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పిస్తున్నారు. పెద్దమొత్తంలో పెట్టుబడి రుణాలు అందుబాటులో ఉంచుతున్నారు. కానీ ఈ బడా సంస్థలన్నీ దివాలా తీస్తే..దాని ఫలితం దేశ ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆగేయాసియా దేశాల్లో 1997-98 ఆర్థిక సంక్షోభం ఒక ఉదాహరణ. వ్యాపార సామ్రాజ్యాలు కుప్పకూలటంతో ఆగేయాసియా దేశాల కరెన్సీ విలువ అమాంతం పడిపోయింది. దక్షిణ కొరియా, మలేసియా, థాయిలాండ్ కరెన్సీ విలువలు 40శాతం క్షీణించాయి.
రిస్క్‌లో భారత ఆర్థిక వ్యవస్థ
సంక్షోభ సమయంలో విదేశీ అప్పులు చెల్లించటం కోసం ద.కొరియాకు చెందిన ఎల్జీ, హ్యూందారు, సాంసంగ్‌లకు తమ ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌లో ఇలాంటి పరిస్థితి ఊహించగలమా? కార్పొరేట్ కంపెనీలు దివాలా తీస్తే ఇక్కడ దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపైన్నే ఉంటుంది. ఉదాహరణకు అదానీ గ్రూప్ మొత్తం అప్పుల్లో 30 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.2.5 లక్షల కోట్లు) విదేశాల నుంచి వచ్చిందే. వేదాంత గ్రూప్ కంపెనీకి కూడా భారీ ఎత్తున విదేశీ రుణాలున్నాయి. మోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెమి-కండక్టర్ చిప్ ప్రాజెక్ట్ 'వేదాంత'కు దక్కింది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 50శాతం సబ్సిడీ లభించింది. దీనివిలువ మన రూపాయల్లో రూ.1.6 లక్షల కోట్లు. ఒక కుటుంబం చేతిలో నడుస్తోన్న 'వేదాంత గ్రూప్'నకు ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ సబ్సిడీలు సమకూరటం గతంలో లేదు.
రాజకీయ లబ్ది ఉంటేనే..
దేశంలో ప్రయివేటు పెట్టుబడి వ్యయం పెరిగితేనే ఉపాధి మెరుగుపడుతుందని మొన్నటి వరకూ మోడీ సర్కార్ భావిస్తూ వచ్చింది. పలు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రయివేటీకరిస్తూ తన చర్యల్ని సమర్థించుకుంది. ఇందులో రాజకీయ లబ్దిని చూసుకుంటూ మోడీ సర్కార్ ముందుకెళ్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ 'రిలయన్స్ జియో'. బీఎస్ఎన్ఎల్కు 4జీ సెక్ట్రమ్ ఇవ్వకుండా, టెలికాంకు సంబంధించి ఎన్నో నిబంధనల్ని పక్కన పడేసి, అనేక మినహాయింపులు 'జియో'కు దక్కాయి. స్వల్ప వ్యవధిలో 20కోట్ల వినియోగదారులు జియోకు లభించారు. కొద్ది నెలల్లో అతిపెద్ద టెలికాం సేవల సంస్థగా 'జియో' ఆవిర్భవించింది. వాట్సాప్, ఇతర సామా జిక మాధ్యమాల ద్వారా 'మోడీ సర్కార్' అనుకూల ప్రచారం అందేందుకు 'జియో' సేవలు దోహదపడ్డాయి. అప్పటికే ఉన్న వొడాఫోన్, ఎయిర్‌టెల్‌తో తమ వ్యూహం అమలు కాదనే 'జియో'ను కేంద్రం ఎంచుకుంది.