Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకత్వ స్థానాల్లో వీరి ప్రాతినిథ్యం సున్నా
- ఇప్పటికీ పెత్తందారీ కులాలదే ఆధిపత్యం
- దళిత జర్నలిస్టులు, సామాజికవేత్తల ఆందోళన
న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశ మీడియా తన విశ్వాసాన్ని కోల్పోతున్నది. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వార్తా సంస్థలు విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయి. అదానీ, అంబానీ.. వంటి బడా పారిశ్రామిక వేత్తలు మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా, ప్రముఖ వార్త సంస్థ ఎన్డీటీవీలో షేర్లను అదానీ సొంతం చేసుకున్నప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. ప్రముఖ యాంకర్ రవీశ్ కుమార్ ఎన్డీటీవీనే వీడి వెళ్లారు. అదానీ చేతిలోకి ఎన్డీటీవీ వెళ్లడంతో.. 'ఒక యుగం ముగిసింది' అని దేశంలోని పలువురు విద్యావేత్తలు, జర్నలిస్టులు, పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పుడు కుల జాఢ్యం వార్త సంస్థలనూ వీడటం లేదు. అక్కడా పెత్తందారీ కులాలే ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ముఖ్యంగా, దళితులను వార్తల్లో చూపించటమే తప్పా.. వారికి కీలక స్థానాల్లో పదవులు దక్కటం లేదు. కనీసం దళితులు రాసే వార్తలు, కథనాలకూ తగిన స్థానం దక్కటం లేదు. ఇప్పుడు ఎన్డీటీవీ చానెళ్లలోనూ ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దళితుల ప్రాతినిథ్యం తగినంతగా లేకపోవడంపై దళిత జర్నలిస్టులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు ఆందోళనను వెలిబుచ్చారు.
జనాభాలో 20 శాతం.. ఛానెళ్లలో 88 శాతం
2018 ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం.. భారత మీడియాలో అగ్రశ్రేణి 88 శాతం నాయకత్వ స్థానాలను పెత్తందారి కులాలవారు కలిగి ఉన్నారు. జనాభాలో వీరి సంఖ్య 20 శాతం కంటే తక్కువే. దళితులకు మాత్రం ఉన్నత పదవులు దక్కలేదు. నాలుగేండ్ల తర్వాత కూడా ఈ లెక్కలో మార్పు రాలేదు. ఇప్పటికీ ఆ సంఖ్య సున్నాగానే ఉన్నది.
ఎస్సీ, ఎస్టీల యాంకర్లే లేరు
హిందీ, ఆంగ్ల ప్రైమ్‌టైమ్ షోలలో యాంకర్లు, ప్యానలిస్టులలో సగానికి పైగా పెత్తందారీ కులాలకు చెందినవారే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి మాత్రం యాంకర్లే లేకపోవడం గమనార్హం. ఇక డిజిటల్ మీడియాలో ఐదు శాతం కంటే తక్కువ కథనాలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులతో రాయబడ్డాయి.
అనధికారిక సమాచారం ప్రకారం అదానీ చేతిలోకి వెళ్లిన ఎన్డీటీవీకి సంబంధించి హిందీ న్యూస్ ఛానెల్లో వంద శాతం మంది 'జనరల్' వర్గానికి చెందినవారే ఉన్నారు. ఎన్డీటీవీ ఆంగ్ల వార్తా ఛానెల్లో ఒక్క ఎస్సీ, ఎస్టీ యాంకర్ కూడా లేరు. దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ మీడియా సంస్థల్లోనూ ఇవే పరిస్థి తులు ఉన్నాయని పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్య కర్తలు ఆందోళన వ్యకం చేశారు. దళితులు, ఇతర వెనక బడిన కులాల వారి గురించి వార్తలు ప్రసారం చేసే మీడి యా సంస్థలు.. తమ వరకు వచ్చేసరికి సదరు కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం గమనార్హ మని చెప్పా రు. భారతీయ జనాభాలో అణగారిన కులాలు 77 శాతం వరకు ఉన్నారు. అయినప్పటికీ.. వారు ప్రధాన స్రవంతి మీడియాలో చాలా తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. కుల సమస్యలకు సంబంధించిన వార్త కథనాలలో ఏడు శాతం మాత్రమే దళితులు రాసినట్టు డేటా చూపిస్తున్నది.
కథనాలు తిరస్కరణ
మీడియా సంస్థల్లో దళితులకు సరైన గౌరవము, గుర్తింపు దక్కటం లేదని సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు చెప్పారు. అణగారిన కులాల కథనాలను బయటకు తీసుకురాకుండా దళితులను దూరం పెడుతున్నారని అన్నారు. తాము రాసిన కథనాలను అనేక జాతీయ వార్త పేపర్లు తిరస్కరించాయని పలువురు దళిత రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశం దళితులకు సంబంధించిన వార్తలనే కోరుకోవటం లేదనీ.. దళిత జర్నలిస్టులను కోరుకుంటున్నదని చెప్పారు. ప్రధాన స్రవంతి మీడియా ఈ వైపుగా ఆలోచించి కీలక పోస్టుల్లో దళితులకూ అవకాశం కల్పించాలని వారు కోరారు.