Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయం, కోపోద్రేకం, ఆందోళన వంటి రుగ్మతులతో ప్రస్తుతం అవస్థలు
పనాజీ: కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో ఆర్యోగ రక్షణ కార్యకర్తల్లో ముందు వరసలో ఉండి కోవిడ్ రోగులకు చికిత్స చేసి, వారు కోలుకోవడంలో సహాయం చేసిన నర్సులు ప్రస్తుతం అనేక మానసిక రుగ్మతులతో బాధపడు తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రిక్ నర్సింగ్‌లో ప్రచురించిన ఈ అధ్యయన ప్రకారం కోవిడ్ చికిత్సలో పాల్గొన్న నర్సులు ప్రస్తుతం ఆలసట, ఒత్తిడి, నిద్రలేమి, నిరాశలతో పాటు భయం, కోపోద్రేకం, ఆందోళన వంటి మానసిక రుగ్మతులతో బాధపడుతున్నారు. కోవిడ్ చికిత్స నిర్వహిస్తున్న సమయంలో ఎనలేని మానసిక సంఘర్షణకు గురికావడంతోనే నర్సులు ప్రస్తుతం వీటితో బాధపడుతున్నారని అధ్యయనం తెలిపింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులు ఈ రుగ్మతులతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయన నివేదికను జి బాలమురుగన్, జి రాధాకృష్ణన్, ఎం విజయరాణి రూపొందించారు. ఈ అధ్యయనంపై పనాజీలో తాజాగా ఇండియన్ సొసైటీ ఆఫ్ సైకియాట్రిక్ నర్సెస్ (ఐఎస్‌పిఎన్) ఒక మీడియా సమావేశం నిర్వహించింది. నర్సుల దుస్థితిని ప్రత్యేకంగా ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కోవిడ్ 19 మహమ్మారి నర్సుల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిందని ఐఎస్‌పిఎన్ అధ్యక్షులు కె రెడ్డమ్మ తెలిపారు. 'కోవిడ్ సమయంలో నర్సులు రోగులకు అండగా నిలిచారు. అయితే నర్సులు ధరించిన పిపిఇ కిట్ల కారణంగా వారు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయారు అలాగే ఆసుపత్రుల నుంచి బయటకు వెళ్లలేకపోయారు' అని రెడ్డమ్మ తెలిపారు. కోవిడ్ సమయంలో నర్సులు చేసిన కృషికి నివాళిగా ఈ ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని 'అంకిత దినోత్సవం' గా పాటిస్తామని రెడ్డెమ్మ చెప్పారు.