Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లలో వందకు పైగానే..!
- ఒక్క బెంగళూరులోనే 52 శాతం
- రాష్ట్ర ప్రభుత్వ సమాచారం
బెంగళూరు : బీజేపీ పాలిత రాష్ట్రం కర్నాటకలో ద్వేషపూరిత ప్రసంగాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటికి సంబంధించిన కేసులు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. గత మూడేండ్లలోనే ఈ రాష్ట్రంలో ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి దాదాపు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఆ రాష్ట్ర హోం శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2020 జనవరి నుంచి 2023 జనవరి మధ్య కర్నాటకలో 105 ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అయితే, ఇలాంటి కేసులు అత్యధికంగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో 52 శాతానికి పైగా నమోదు కావడం గమనార్హం. 2022లో రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 105 కేసులలో బెంగళూరులో అధికంగా 55 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీదర్, శివమొగ్గ, కలబురగి, హవేరి జిల్లాలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి పోలీసు అధికారులు కేసులు నమోదు చేయలేదనీ, ఇలాంటి విషయాల్లో సుమోటో చర్యను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని వారు కోరారు. బీజేపీ పాలనలో నానాటికీ పెరిగిపోతున్న ద్వేషపూరిత ప్రసంగాలపై పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని నిరసిస్తూ ఇప్పటికే బెంగళూరులోని డీజీపీ కార్యాలయం ముందు లాయర్లు, మహిళా హక్కుల కార్యకర్తలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
గతేడాది హిజాబ్ నిరసనలతో కర్నాటక రాష్ట్రం వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా, ఈ విషయంలో బీజేపీ నాయకుల వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసే విధంగా చేశాయి. దీంతో రాష్ట్రంలో అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి. సామాజిక కార్యకర్తలు, హేతువాదులపై హిందూత్వ శక్తుల విద్వేషపూరిత ప్రసంగాలు రాష్ట్రంలో తీవ్రమయ్యాయి. అయితే, బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నదనీ, కొన్నింటిలోనే కేసులు నమోదు చేస్తూ పక్షపాతాన్ని చూపిస్తున్నదని సామాజిక కార్యకర్తలు ఆరోపించారు.