Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలి
- జంతర్ మంతర్ లో ఏఐకేఎస్ ధర్నా
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి సంఘీభావం
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో బలవంతపు భూసేకరణ ఆపాలని, అక్టోబరు-2020 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎస్,జేకేకేటీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. బుల్డోజర్లతో కూడిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఏఐకేఎస ్, జమ్మూ, కాశ్మీర్ కిసాన్ తెహ్రీక్ (జేకేకేటీ ) ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ ఆందోళనకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్ తరిగామి, ఏఐఏడబ్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, ఐద్వా ఢిల్లీ అధ్యక్షురాలు మైమూనా మొల్లా, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్, జేఎన్ యూఎస్ యూ అధ్యక్షురాలు ఐషీ ఘోష్ సంఘీభావం తెలిపారు.
సీతారాం ఏచూరి మాట్లాడుతూ... ఎన్నో తరాలు అలాంటి భూముల్లోనే ఉంటూ వాటిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయని అన్నారు. ఈ నివాసాలను క్రమబద్ధీకరించాలనీ, రైతుల భూమి హక్కులను పరిపాలన విభాగం రక్షించాలని డిమాండ్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ బుల్డోజర్లను ఉపయోగించి పేద ప్రజలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా భూమి నుంచి ఖాళీ చేయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూమిపై 30 ఏండ్లకు పైగా నిరంతరాయంగా ఆధీనంలో ఉన్నవారు క్రమబద్ధీకరణకు హక్కులు పొందవచ్చని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమిలో నివాసితుల హక్కులను గుర్తిస్తూ 1924 నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్లు ఉన్నాయని తెలిపారు.
ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, జేకేకేటీ ప్రధాన కార్యదర్శి జహూర్ అహ్మద్ మాట్లాడుతూ ముందున్న అన్ని భూ చట్టాలను రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ వెలుపల ఉన్నవారికి భూమిని కొనుగోలు చేయడం సులభతరం చేశారని విమర్శించారు. జమ్మూ, కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఎల్డీ పరిపాలనా అధికారులు వివిధ జిల్లాల్లో వందలాది మంది పేద రైతులు, చిన్న ఉత్పత్తిదారులపై బుల్డోజర్లను ఉపయోగించి బహిష్కరించి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ఇండ్ల నుంచి బలవంతంగా తొలగించి, భూమిని గుంజుకుంటున్నారని విమర్శించారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న ప్రభుత్వ భూమిపై ఆధారపడిన గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులకు, భూనిర్వాసితులకు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలోని ప్రస్తుత పరిపాలన నిర్వాసితులను భూ కబ్జాదారులుగా ముద్రవేయడం అన్యాయమే కాకుండా పూర్తిగా తప్పుదారి పట్టించేదని విమర్శించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలను రైతులు, ప్రజలు సాధారణంగా సహించలేరని, రానున్న రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. జమ్మూ కాశ్మీర్లోని రైతుల భూమి, జీవనోపాధిపై వారి హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐకేఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. అటవీ హక్కుల చట్టం అమలును నిర్ధారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ అంతటా రైతులు నిరసనలు చేస్తున్నారని, ఈ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. ధర్నాలో ఏఐకెేఎస్ కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్, ఏఐకెేఎస్ ఉపాధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్, జేకేకేటీ ప్రాంతీయ కార్యదర్శి కిషోర్ కుమార్, ఏఐకేఎస్ హర్యానా రాష్ట్ర కార్యదర్శి సుమిత్ దలాల్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కి చెందిన రైతులు పాల్గొన్నారు.