Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడబ్ల్యూసీ సభ్యులను నామినెట్ చేసే అధికారం చీఫ్‌కే...:కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం
రాయ్‌పూర్ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెడుతూ పార్టీ స్టీరింగ్ కమిటీ శుక్రవారం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు అవసరం లేదని అభిప్రాయపడింది. ఛత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మాట్లాడుతూ, సీడబ్ల్యూసీ ఎన్నికల గురించి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా చర్చించిందన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులందరినీ నియమించే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందన్నారు. స్టీరింగ్ కమిటీ సమావేశంలో 45 మంది సభ్యులు (అందరూ) పాల్గొన్నారని తెలిపారు. వీరిలో కొందరు సీడబ్ల్యూసీ ఎన్నికలకు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పోషించాల్సిన పాత్రను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ సవాళ్లను ఎదుర్కొవాలని నిర్ణయించింది. అందువల్ల ప్రస్తుతానికి సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించరాదని నిర్ణయించినట్టు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధాన మంత్రులను సీడబ్ల్యూసీలో నియమిస్తారన్నారు. సీడబ్ల్యూసీలో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనారిటీలు, యువతకు కేటాయించినట్టు తెలిపారు. స్టీరింగ్ కమిటీ తీసుకున్న ఈ ఏకగ్రీవ నిర్ణయాన్ని ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులంతా మద్దతిస్తారనే సంపూర్ణ విశ్వాసం తమకు ఉన్నదని చెప్పారు.
స్టీరింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. అంతకుముందు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ''మీరు మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించండి, సమిష్టి నిర్ణయం తీసుకోండి అని నేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా కోరుతున్నాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది నా నిర్ణయం, ప్రతి ఒక్కరి నిర్ణయం అవుతుంది'' అని తెలిపారు.