Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచారాన్ని ప్రారంభించిన మహాకూటమి
- బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాల ఐక్యతకు పిలుపు
- ర్యాలీలో పాల్గొన్న నితీశ్, తేజస్వీ, మాంఝీ, దీపాంకర్
- ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించిన లాలూ
పాట్న : బీహార్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. బీజేపీ ఓటమే ధ్యేయంగా రాష్ట్రంలోని అధికార మహాకూటమి అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా శనివారం ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి మాంఝీ, సీపీఐ-ఎంల్ పార్టీ ప్రధాన కార్యదర్శి దీపాంకర్, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అజరు కుమార్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలని మహాకూటమి పిలుపునిచ్చింది. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న వెనుకబడిన ప్రాంతం సీమాంచల్‌లోని పూర్నియాలో నిర్వహించిన సంయుక్త ర్యాలీలో మహాకూటమి అగ్రనేతలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడటంలో భాగంగా బీజేపీని ఓడించేందుకు ప్రజలు తమకు మద్దతు పలకాలని మహా కూటమి అగ్రనాయకత్వం కోరింది. గతేడాది ఆగస్టులో బీజేపీతో నితీశ్ తెగదెంపులు చేసుకొని మహాకూటమితో చేతులు కలిపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మహాకూటమి మొదటి సంయుక్త ర్యాలీ ఇదే కావడం గమనార్హం.
మనం ఐక్యతతో బీజేపీ ఓటమి తథ్యం : లాలూ
దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడంంలో భాగంగా బీజేపీని ఓడించేందుకు మా ఐక్యత తప్పనిసరి అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. మనమంతా ఐక్యంగా ఉంటే బీజేపీని తుడిచిపెట్టేయ్యచ్చని తెలిపారు. ప్రధాని మోడీ ఆరెస్సెస్ ఆదేశాలను పాటించడం తప్పితే ఏమీ చేయడం లేదని అన్నారు. వారు (బీజేజీ, ఆరెస్సెస్) మైనారిటీలను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారనీ, రిజర్వేషన్లకు ముగింపు పలకాలని చూస్తున్నారని చెప్పారు. గతేడాదే విజయ వంతంగా కిడ్ని ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న లాలూ ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు.
కాంగ్రెస్ చొరవ తీసుకోవాలి : నీతీశ్
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి, బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాల బలమైన ఐక్యతను తాను కోరుకుంటున్నానని నితీశ్ కుమార్ ఈ ర్యాలీలో పునరు ద్ఘాటించారు. ఈ దిశగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం త్వరగా చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అనుకుంటే వచ్చే ఏడాది ప్రభుత్వ మార్పు జరుగుతుందనీ, ఇందుకు ప్రతిపక్షాలూ చేతులు కల్పడానికి ఆసక్తిగా ఉన్నాయని నితీశ్ అన్నారు. దీనిపై కాం గ్రెస్ నిర్ణయం కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పా రు. సీమాంచల్‌లో బీజేపీ 'బీ టీమ్' పట్ల అప్రమత్తంగా ఉం డాలని ఎంఐఎం పార్టీపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
మత శక్తులపై ఐక్యంగా పోరాడుతా : తేజస్వీ యాదవ్
మతశక్తుల ముందు ఎన్నడూ తలవంచని తన తండ్రి లాగే తానూ ఉంటానని తేజస్వీ యాదవ్ అన్నారు. మతతత్వ శక్తులను ఓడించడానికి మహాకూటమిలోని మిత్రపక్షాలతో కలిసి ఐక్యంగా పోరాడుతానని చెప్పారు. మహాకూటమిలో ఉన్న హిందూస్తాన్ ఆవామీ మోర్చా అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మాంఝీ.. లాలూకు తన మద్దతును తెలిపారు.
ఆరెస్సెస్, బీజేపీలు రిజర్వేషన్లకు ముగింపు పలకాలనుకుంటున్నాయని మాంఝీ చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అజరు కుమార్ దాడి చేశారు. బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాల ఐక్యత గురించి నొక్కి చెప్పారు. మోడీ, ఆయన గుజరాత్ మోడల్ 2022 గుజరాత్ అల్లర్లకు ప్రతీక అని దీపాంకర్ భట్టాచార్య ప్రజలకు గుర్తు చేశారు.