Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రసారభారతి సారథ్యంలో నడిచే దూరదర్శన్ ఛానల్స్, ఆల్ ఇండియా రేడియో..ఇకపై పూర్తిగా ఆర్ఎస్ఎస్ చేతిలోకి వెళ్లిపోయాయి. దేశంలో పేరొందిన వార్తా ఏజెన్సీ 'ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా' (పీటీఐ)ను పక్కకు పెట్టి ఆర్ఎస్ఎస్కు చెందిన న్యూస్ ఏజెన్సీ 'హిందుస్తాన్ సమాచార్'తో ప్రసార భారతి కొద్ది రోజుల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి దేశవ్యాప్తంగా రోజువారీ వార్తా కథనాలు, ఫొటోలు, ఇంటర్వ్యూల కోసం దూరదర్శన్ టీవీ ఛానల్స్, ఆల్ ఇండియా రేడియో 'హిందుస్తాన్ సమాచార్'పై ఆధారపడ నున్నాయి. రెండేండ్ల కాలపరి మితితో కూడిన ఈ ఒప్పందం మార్చి 2025న ముగుస్తుంది. ఈ కాంట్రాక్ట్ నిమిత్తం హిందుస్తాన్ సమా చార్‌కు సుమారుగా రూ.7.7 కోట్లు చెల్లించబోతున్నట్టు ఒప్పందంలో ప్రసారభారతి పేర్కొన్నది.
- ఆర్ఎస్ఎస్కు చెందిన 'హిందుస్తాన్ సమాచార్'కు రెండేండ్ల కాంట్రాక్ట్
- దూరదర్శన్ ఛానల్స్, ఆల్ ఇండియా రేడియోకు పీటీఐ సేవలు పూర్తిగా బంద్
- 2017 నుంచి ఏజెన్సీపై కక్షసాధింపు..ఇప్పుడు సబ్స్క్రిప్షన్ రద్దు..
న్యూఢిల్లీ : ప్రతిరోజూ కనీసం 100 వార్తా కథనాలు ఇవ్వాలని, దాంట్లో కనీసం 10 జాతీయ వార్తా కథనాలు, 40 స్థానిక వార్తా కథనాలు ఉండాలని ఒప్పందంలో తెలిపారు. 2017లో పీటీఐ సేవల్ని ప్రసారభారతి రద్దు చేసింది. ఆనాటి నుంచి ఇప్పటివరకూ పీటీఐ, యుఎన్ఐ న్యూస్ ఏజెన్సీల సేవల్ని పాక్షికంగా వినియోగించు కుం టోంది. ఏజెన్సీల నుంచి మోడీ సర్కార్ అనుకూల వార్తలు, ఇంటర్వ్యూలు వస్తేనే వాటిని స్వీకరించటం మొదలైంది. గతకొన్నేండ్లుగా హిందుస్తాన్ సమాచార్‌ను మెల్లమెల్లగా ప్రోత్సహిస్తూ, ఇప్పుడు పూర్తిస్థాయిలో కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు పీటీఐ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా రద్దు చేసింది. ఆ రెండు న్యూస్ ఏజెన్సీలతో కొనసాగుతున్న కాంట్రాక్ట్‌లను రద్దు చేసుకోవాలని ప్రసారభారతిపై ఒత్తిడి తెస్తోంది.
అనుకూలంగా రాయలేదని..
పీటీఐతో పోల్చితే 'హిందుస్తాన్ సమాచార్' చాలా చిన్న ఏజెన్సీ. ఎంతో అనుభవ మున్న రిపోర్టర్స్, ఫొటోగ్రాఫర్స్‌ను పీటీఐ దేశవ్యాప్తంగా కలిగివుంది. ఇంత పెద్ద నెట్వర్క్ సంస్థను కాదని చాలా పరిమితమైన వార్తా సేకరణ వ్యవస్థ కలిగిన 'హిందుస్తాన్ సమాచార్'కు కాంట్రాక్ట్ దక్కటం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అనుకూల వార్తా కథనాలు వెలువరించటమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశం. పీటీఐ, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యుఎన్ఐ) మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తోందని, ఆ సంస్థలపై కేంద్రం కక్ష్యపూరిత చర్యలకు దిగటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. లడఖ్ సరిహద్దులో భారత్-చైనా మధ్య చోటుచేసుకున్న ఘటనలపై పీటీఐ వార్తా కథనాలు మోడీ సర్కార్‌కు రుచించ లేదు. భారత్‌లో చైనా రాయబారిని, చైనాలో భారత రాయబారిని ఇంటర్వ్యూలు చేయటం కేంద్రానికి మింగుడుపడలేదు.
కేంద్రం ఒత్తిడికి తలొగ్గని పీటీఐ
తమకు అనుకూలురైన వ్యక్తులతో పీటీఐ ఎడిటోరియల్ బోర్డును నింపాలని మోడీ సర్కార్ గతంలో బెదిరింపులకు దిగింది. కేంద్రం తీసుకొచ్చిన ఒత్తిడికి పీటీఐ తలొగ్గలేదు. ప్రముఖ వెటరన్ జర్నలిస్టు విజరు జోషిని ఎడిటోరియల్ హెడ్‌గా నియమించింది. దాంతో 2017 నుంచి పీటీఐ, ప్రసారభారతి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని పీటీఐ భవనం నుంచి ప్రసారభారతి కార్యాలయం వేరే చోటకు తరలివెళ్లిపోయింది. తాజా పరిణామంపై కేంద్ర సమాచార శాఖ మాజీ కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ, ''పీటీఐతో ఉన్న కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని కేంద్రం ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. పీటీఐ ఎక్కువ మొత్తం ఛార్జ్ చేస్తోందని చెప్పటం ఒక సాకు మాత్రమే. సమయం కోసం ఎదురుచూసి పీటీఐ, యుఎన్ఐను దెబ్బకొట్టాలని భావించింది'' అని అన్నారు. స్వతంత్ర న్యూస్ ఏజెన్సీగా పీటీఐతో మోడీ సర్కార్‌కు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అక్టోబర్ 2020నాటికి అవి పతాక స్థాయికి చేరుకున్నాయని ప్రసార భారతి ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఎవరిదీ 'హిందుస్తాన్ సమాచార్'
వివిధ ప్రాంతీయ భాషల్లో వార్తా ఏజెన్సీ సేవలు అందించే నిమిత్తం 1948లో 'హిందుస్తాన్ సమాచార్'ను తీసుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శివరామ్ శంకర్ ఆప్టే, వీహెచ్‌పీ వ్యవస్థాపకుల్లో ఒకరు కలిసి దీనిని ఆనాడు ఏర్పాటుచేశారు. కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పాటైన వెంటనే 'హిందుస్తాన్ సమాచార్'కు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు పెద్ద ఎత్తున దక్కటం మొదలైంది. 2014కు ముందు..న్యూఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌కు సమీపంలో ఒక చిన్న భవనంలో ప్రధాన కార్యాలయం ఉండేది. మోడీ సర్కార్ వచ్చాక..నోయిడాలోని అత్యంత ఖరీదైన భవనంలోకి మారిపోయింది.