Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో నియోజకవర్గానికి ఒకరు
- నియమించిన ఎన్నికల సంఘం
అగర్తల : ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగించుకున్న ఈశాన్య రాష్ట్రం త్రిపురకు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం తొలిసారిగా 60 మంది లెక్కింపు పరిశీలకులను (కౌంటింగ్ అబ్జర్వర్లు) నియమించింది. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ నియామకాన్ని జరిపింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిపేందుకు లెక్కింపు పరిశీలకులను నియమించినట్టు త్రిపుర రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్. బందోపాధ్యాయ తెలిపారు.
ఓట్ల లెక్కింపు పరిశీలకులు మంగళవారం (ఈనెల 28) నాటికి త్రిపుర చేరుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.కె సిన్హా, సీఈఓ గిట్టె కిరణ్ కుమార్ దినకర్రావు, డీజీపీ అమితాబ్ రంజన్ లు ఇప్పటికే మొత్తం ఎనిమిది జిల్లాలలో పర్యటించి భద్రతా చర్యలకు సంబంధించి అన్ని జిల్లాల మేజిస్ట్రేటులు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించారని బందోపాధ్యాయ తెలిపారు. పటిష్ట భద్రత నడుమ మొత్తం 21 కౌంటింగ్ హాల్లలో మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నదని అన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 16న త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 2న జరిగి అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.