Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు ఖాతాలు బ్లాక్ చేయాలన్న ఈడీ నోటీసు రద్దు
- కర్నాటక హైకోర్టు ఆదేశాలు
బెంగళూరు : ప్రముఖ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాకు ఊరట లభించింది. సదరు సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేయాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసుకు కర్నాటక హైకోర్టు బ్రేకులు వేసింది. ఆ నోటీసును రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. విదేశీ మారకపు నిర్వహణ, ఐటీ చట్టాల కింద 2018లో ఈడీ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈడీ పంపిన నోటీసును సవాలు చేస్తూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, ఇండియన్స్ ఫర్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్టు కర్నాటక హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై కర్నాటక హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సదరు నోటీసును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటీసు కేవలం 60 రోజుల మాత్రమే చెల్లు బాటు అవుతుందని ధర్మాసనం తెలిపింది. కోర్టు తీర్పుతో ఈడీకి చుక్కెదు రైంది. ఈడీ ఆమ్నెస్టీ ఇండియా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో ఆమ్నెస్టీ ఇండియా కార్యాలయాలు 2020లో మూతపడిన విషయం తెలిసిందే. నిరాధార, ప్రేరేపిత ఆరోపణలను ఆధారంగా చేసుకొని భారత ప్రభుత్వం మానవ హక్కుల సంస్థపై ఎడతెగని వేట చేస్తున్నదని ఆ సమయంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఆరోపించింది.