Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడే మేఘాలయ, నాగలాండ్ అసెంబ్లీ ఎన్నికలు
- బరిలో 552 మంది.. 34 లక్షల మందికి పైగా ఓటర్లు
- సర్వం సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు
- మార్చి 2న త్రిపురతో పాటు ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు
షిల్లాం, కోహిమా : ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ, నాగలాండ్లలో నేడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో 60 చొప్పున ఉన్న అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నాగలాండ్‌లో ఒక స్థానం ఏకగ్రీవమైంది. మేఘాలయలో ఒక స్థానంలో అభ్యర్థి మరణించారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో 59 చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ చేశారు. రెండు రాష్ట్రాల్లో పలు పార్టీల నుంచి మొత్తం 552 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 34 లక్షల మందికి పైగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసుకున్న మరో ఈశాన్య రాష్ట్రంతో పాటు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 2న వెలువడనున్నాయి.
మేఘాలయలో 369 మంది అభ్యర్థులు
మేఘాలయలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 21.4 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 10.8 లక్షల మంది మహిళలు ఉన్నారు. పలు ప్రధాన పార్టీలు, ఇండిపెండెంట్లు కలుపుకొని మొత్తం 369 మంది అభ్యర్థులు బరి ఉన్నారు. వీరిలో 36 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికలు సాఫీగా సాగడానికి మేఘాలయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు మోహరించాయి. మొత్తం 60 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ లు తమ అభ్యర్థులను నిలిపాయి. అధికార ఎన్పీపీ 57 మంది అభ్యర్థులను బరిలో ఉంచింది. టీఎంసీ 36 మందిని పోటీలో పెట్టింది. 44 మంది ఇండిపెండెంట్లు అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో మొత్తం 3482 పోలింగ్ స్టేషన్లలో దాదాపు 900 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎఫ్ఆర్ ఖర్కోంగర్ చెప్పారు. బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దును వచ్చేనెల 2 వరకు మూసివేయాలని ఆదేశించినట్టు తెలిపారు.
నాగలాండ్‌లో 183 మంది అభ్యర్థులు
మరో ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో 59 స్థానాలకు గానూ 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 13 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార నేషనలిస్టు డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీ కూటమి 40:20 నిష్పత్తిలో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. 2003 వరకు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌కు ప్రస్తుతం సభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ప్రస్తుతం ఆ పార్టీ 23 మంది అభ్యర్థులను పోటీలో పెట్టింది. 19 మంది ఇండిపెండెంట్లు పోటీ చేయనున్నారు.