Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలాది మంది మృతి.. లక్షలాది మందికి గాయాలు
- ఆపన్న హస్తం కోసం గుజరాతీల ఎదురు చూపులు
- గుర్తు చేస్తున్న టర్కీ, సిరియా భూకంప పరిస్థితులు
న్యూఢిల్లీ : ఇటీవల టర్కీ, సిరియా దేశాలను భూకంపాలు వణికించాయి. ముఖ్యంగా, టర్కీ దేశం ఈ ప్రకృతి వైపరీత్యానికి తీవ్ర ధన, ప్రాణ, ఆస్థి నష్టాన్ని చూసింది. ఎటు చూసినా ఆందోళనకర పరిస్థితులు ఆ దేశంలో నెలకొన్నాయి. ఈ పరిస్థితులే ఇప్పుడు 2001లో గుజరాత్లో సంభవించిన భయానక భూకంప రోజులను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా, భుజ్ కేంద్రంగా ఏర్పడిన భూకంపం అక్కడి ప్రజలకు మానని గాయాన్ని మిగిల్చింది. 2001 జనవరి 26న ఉదయం 8-9 గంటల ప్రాంతంలో.. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయాలపాలయ్యారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా భూకంప కేంద్రమైన భుజ్‌లో ఈ నష్టం తీవ్రంగా ఉన్నది. అక్కడి పరిస్థితులు హృదయ విదారకంగా మారాయి. రిపబ్లిక్ డే రోజు వేడుకలు జరుపుకుంటున్న ఒక స్కూల్ భవనం కూలిపోవడంతో దాదాపు విద్యార్థు లందరూ మరణించారు. అనేక మంది చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్న దృశ్యాలు కంటతడి తెప్పిం చాయి. భుజ్‌లో పరిస్థితి తీవ్రతను తెలియజేసే ఘట న ఇది ఒకటి. ఇలా అనేక ఘటనలు భూకంపం మిగిల్చిన గాయాలే. ఈ విపత్కర పరిస్థితిని అదుపు లోకి తీసుకురావడానికి అనేక వారాల సమయం పట్టింది. బాధితులకు పునరావాసం కల్పించడానికి అనేక నెలల సమయం పట్టింది. అప్పటి పరిస్థితుల్లో గుజరాత్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏ మాత్రమూ సరిపోలేదు. ఇటు రాష్ట్రంలో ప్రధాన నగరమైన అహ్మదాబాద్‌కు దేశ, విదేశాల నుంచి సహాయ సామాగ్రి, ఆహార ధాన్యాలు, ఇతరత్రా అవసరమైన వస్తువులు వచ్చి చేరాయి. సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంధ సంస్థలు, పౌర సంఘాలు, యువత, విద్యార్థులు.. ఇలా సకల జనులు గుజరాత్‌కు ఆపన్న హస్తం అందించడానికి ముందుకు కదిలారు. చందాల రూపంలో తమకు తోచిన సాయాన్ని అందించారు. అధికారిక లెక్కల ప్రకారం గుజరాత్ భూకంపంలో 20 వేల మంది మరణించగా, 1.6 లక్షల మంది గాయపడ్డారు.