Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్యం కుంభకోణం కేసులో జైలుకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి
- 8 గంటలపాటు సీబీఐ విచారణ
- బీజేపీ రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టయ్యారు. ఆదివారం మధ్యాహ్నం సీబీఐ విచారణకు వెళ్లిన ఆయన్ను అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు సిసోడియాను దాదాపు 8 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు.కాగా బీజేపీ చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
పలుకోణాల్లో విచారణ...
విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న దినేశ్ అరోడా, ఇతర నిందితులతో గల సంబంధాలపై ఆరా తీశారు. వివిధ సందర్భాల్లో చేసిన ఫోన్ కాల్స్ గురించి అడిగినట్టు తెలుస్తోంది. అయితే, మనీశ్ సిసోడియా సమాధానాలతో సంతృప్తి చెందని సీబీఐ అధికారులు.. ఆయన విచారణకు సహకరించడం లేదనీ, కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతో అరెస్టు చేశామని చెబుతున్నారు. సిసోడియా నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలంటే కస్టోడియల్ విచారణ అవసరమని అన్నారు.సోమవారం సిసోడియాను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నది.
సిసోడియా ట్విట్..
మరోవైపు సీబీఐ విచారణకు ముందు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ''నేను ఈ రోజు సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నా. విచారణకు పూర్తిగా సహకరిస్తా. మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సి వచ్చినా.. లెక్కచేయను. నేను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తిని'' అని పేర్కొన్నారు.
ఈ కేసులో సిసోడియాను సీబీఐ గతంలోనూ విచారించింది. డిల్లీ మద్యం కుంభకోణంలో సిసోడియా హస్తం ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సిసోడియా సన్నిహితుడైన విజరు నాయర్‌ను అరెస్టు చేసింది. ఆయనతో పాటు అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోరు బాబు, సమీర్ మహేంద్రు సహా ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అటు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది.
అరెస్టు ఊహించిందే..: ఆప్
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఆయన్ను అరెస్టు చేస్తారని తమకు తెలుసని ఆప్ పేర్కొంది. సీబీఐ పూర్తిగా కేంద్రం ఆదేశాల మేరకే పనిచేస్తోందని దుయ్యబట్టింది. మనీశ్‌ను అరెస్టు చేస్తారని తమకు ఎప్పటినుంచో తెలుసని ఆప్ ఎమ్మెల్యే సురభ్ భరద్వాజ్ అన్నారు. దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేస్తాయో ముందే చెప్పగలిగే పరిస్థితులు ఉండటం విచారకరమన్నారు. సిసోడియా అరెస్టు నియంతత్వానికి పరాకాష్ఠగా ఆప్ ఎంపీ సంజరు సింగ్ అభివర్ణించారు. ''మోడీజీ.. మీరు మంచి మనిషిని, గొప్ప విద్యాశాఖ మంత్రిని అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదు. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఏదో ఒకరోజు మీ నియంతృత్వం అంతమవుతుంది'' అని విమర్శించారు.