Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక వడ్డీ రేట్లతో ప్రయివేటు మూలధన పెట్టుబడి మరింత కష్టతరం:
ఆర్బీఐ ఎంపీసీ సభ్యులు జయంత్ వర్మ్
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యులు, అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ జయంత్ వర్మ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వృద్ధి 'చాలా బలహీనంగా' ఉన్నట్టు కనిపిస్తున్నదని చెప్పారు. పెరుగుతున్న శ్రామిక శక్తి ఆకాంక్షలను తీర్చడానికి దేశానికి అవసరమైనదాని కంటే ఆర్థిక వృద్ధి తక్కువగా ఉండొచ్చని అన్నారు. పెరుగుతున్న ఈఎంఐ చెల్లింపులు గృహ బడ్జెట్లపై ఒత్తిడిని పెంచుతాయని తెలిపారు. ఎగుమతులు ప్రపంచంలో పలు అంశాల కారణంగా ఇబ్బందు లను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. అధిక వడ్డీ రేట్లు ప్రయివేటు మూలధన పెట్టుబడిని మరింత కష్టతరం చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణలో ఉన్నదనీ, దీంతో ఇటువైపు నుంచి ఆర్థిక వ్యవస్థకు మద్దతు తగ్గుతుందని వర్మ్ అన్నారు. ఈ అంశాల కారణంగా మన జనాభా సందర్భం, ఆదాయ స్థాయిని బట్టి పెరుగుతున్న మన శ్రామికశక్తి ఆకాంక్షలకు అనుగుణంగా దేశ ఆర్థిక వృద్ధి తక్కువగా ఉండవచ్చని తాను ఆందోళన చెందుతున్నానని ఆయన తెలిపారు.కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం నుంచి సరఫరా షాక్‌లు క్రమంగా ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు రాబోయే నెలల్లో ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ప్రపంచం యుద్ధంతో జీవించడం నేర్చుకుంటున్నదనీ, అదే సమయంలో ద్రవ్య పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా వృద్ధిని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆయన చెప్పారు. 2022-23 ద్వితీయార్థం అధిక ద్రవ్యోల్బణ సంవత్సరం అని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) అంచనాను ఆర్బీఐ 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. జనవరిలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉన్నది. రిజర్వ్‌బ్యాంక్ స్వల్పకాలిక రుణ రేటును పెంచడంపై స్పందిస్తూ ఈ నేపథ్యంలో విరామం సరైనదని వర్మ్ అన్నారు.
గతేడాది మే నుంచి స్వల్పకాలిక రుణ రేటును పెంచుతున్న రిజర్వ్ బ్యాంకు.. రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. రెపో రేటు ఇప్పుడు 6.5 శాతంగా ఉన్నది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఒకపక్క మోడీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది. 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తామని, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టాప్ 10లో ఉన్నామని ప్రచారాలు చేసుకుంటున్నది. అయితే, అదానీ వంటి బడా స్నేహితుల ప్రయోజనాలకు మోడీ సర్కారు ప్రాధాన్యతనిస్తున్న దని ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.