Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్డీజీ సాధించకపోతే అంతే .. ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం
- యూఎన్ఓ 33 సూచికల్లో 19 భారత్ లక్ష్యంలో లేవు : 'ది లాన్సెట్' అధ్యయనం హెచ్చరిక
న్యూఢిల్లీ : భారత సుస్ధిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) విషయంలో 'ది లాన్సెట్' అధ్యయనం కీలక విషయాన్ని వెల్లడించింది. భారత్‌లో తక్కువగా అంచనా వేయబడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పలు సూచికలు దేశ ఆరోగ్య రంగంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతాయని పేర్కొన్నది. 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ది లాన్సెట్ రీజినల్ హెల్త్ దక్షిణాసియా జర్నల్‌లో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.
దీని ప్రకారం.. 2030 నాటికి భారత్ ఎస్డీజీని సాధించగలదా లేదా అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఐక్యరాజ్య సమితి అమలు చేసిన 33 సూచికలలో 19 సూచికలను చేరుకోవడం భారత లక్ష్యంలోనే లేదు. ఈ 19 సూచికలలో మూడింటిని ఎప్పటికీ సాధించలేమని సూచిస్తుంది. స్రీలలో (అందరు, గర్భిణీలు, గర్భిణీయేతర స్త్రీలు) రక్తహీనతను సగానికి తగ్గించడం ఇందులో ఒకటి. ఎస్డీజీ లక్ష్యాలు 2030 వరకు పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో రక్తహీనత ప్రాబల్యాన్ని సగానికి తగ్గించాలని భావించాయి. 2016-21 మధ్య ఈ సమస్య ప్రాబల్యం పెరిగింది. ఈ ట్రెండ్ కొనసాగితే లక్ష్యాలు సాధించలేనివిగా మారొచ్చు. ప్రస్తుతం సగానికి పైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అయితే, భారత లక్ష్యం దీనిని 2030 నాటికి 23.57 శాతానికి తగ్గించడానికి మాత్రమే పరిమితమై ఉన్నది.
కొన్ని లక్ష్యాలను సాధించడానికి
దశాబ్దాల కాలం
భారత్ 2030 గడువును కోల్పోతుందని అంచనా వేసిన ఇతర 16 సూచికలలో కొన్నిటిని కొన్ని సంవత్సరాల తర్వాత సాధించవచ్చు. మరికొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. 2016-21 మధ్య ప్రస్తుత మార్పు రేటును పరిశీలిస్తే భారత్ 2031 నాటికి మెరుగైన నీటి లభ్యత, 2033 నాటికి చేతులు కడుక్కోవడం, 2035 నాటికి వంట చేయడానికి స్వచ్ఛమైన ఇంధనం వంటి లక్ష్యాలను చేరుకోగలదని ఈ అధ్యయనంలో అంచనా వేశారు. ఇతర 11 సూచికలు 2041-2162 మధ్య సాధించే అవకాశమున్నది. వీటిలో ప్రాథమిక సేవల అందుబాటు (20 47), పురుషులలో పొగాకు వాడకం తగ్గింపు (2050), భాగస్వామి హింస తగ్గింపు (2090), వృథా,అధిక బరువు తగ్గడం (2162) వంటివి ఉన్నాయి.
మరుగుదొడ్లు లేక 19 శాతం మంది ప్రజలు..
భారత్‌లో 19 శాతం మంది ప్రజలు బహిరంగ మలవిసర్జనను ఆచరిస్తున్నారనీ, ఒడిశా, బీహార్, జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో 30 శాతం మందికి మరుగుదొడ్లు లేవని ఎన్ఎఫ్హెచ్ఎస్-5ను ఇది ఎత్తి చూపింది. 2019 అక్టోబర్‌లో భారత్‌ను బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రధాని మోడీ ప్రకటించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ గురించి వివరిస్తూ.. ఆరోగ్యంపై 60 శాతం ఖర్చు భారత్‌లో జేబు నుంచి ఖర్చు చేయబడుతుందని చెప్పడంతో ఇది ప్రాముఖ్యతను సంతరించుకున్నది. లింగ హింస, మహిళా సాధికారతకు సంబంధించిన చట్టాలు, న్యాయ ప్రక్రియలు, బేటీ బచావో బేటీపడావో, మహిళా శక్తి కేంద్రం, మహిళలకు సంబంధించిన ఇతర పథకాలపై ఎక్కువ శ్రద్ధ అవసరం అని వివరించారు.
అధిక సూచీలను సాధించిన కేరళ జిల్లాలు
33 ఎస్డీజీ సూచీల్లో అధికంగా 13 సూచీలను సాధించినవిగా కేరళలోని ఎర్నాకుళం జిల్లా, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా 13 వరకు సూచికలను సాధించిన జిల్లాలు అధికంగా కేరళతో పాటు తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ఉన్నాయి. 94 జిల్లాలు 8 సూచికలను సాధించాయి. ఆ జిల్లాలు కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అసోం, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల ప్రదర్శన చాలా దారుణంగా ఉన్నది. దాదాపు 171 జిల్లాలను కలిగి ఉన్న ఈ రాష్ట్రాలు రెండు లేదా అంతకంటే తక్కువ ఇండికేటర్ల లక్ష్యాన్ని మాత్రమే సాధించాయి. యుక్త వయసులో గర్భం దాల్చడం, చిన్నారుల్లో వ్యాధి నిరోధకత, మహిళలకు బ్యాంకు ఖాతాలను తెరవడం, ఇంటర్నెట్ వినియోగం, పారిశుద్యం మెరుగుదల, జనన నమోదు, బహుమితీయ పేదరికం తగ్గింపు, విద్యుత్ సదుపాయం, మహిళల్లో పొగాకు వినియోగం, బాల్య వివాహాలు తగ్గడం, ఐదు ఏండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల మరణాల తగ్గుదల వంటివి జాతీయ స్థాయిలో లక్ష్యాల్లో ఉన్నాయి.