Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడు వంటగ్యాస్ సిలిండర్ రూ.527
- ఇప్పుడు రూ.1153.. గణనీయంగా పడిపోయిన రీఫిల్ బుకింగ్
- సబ్సిడీగా ఇస్తామన్న రూ.200 ఎగవేస్తున్న కేంద్రం
ఉజ్వల్ యోజన్ కింద వంటగ్యాస్ సిలిండర్ కనెక్షన్లు పొందిన పేదలు, వలస కార్మికులు తలపట్టుకుంటున్నారు. సిలిండర్ ధర భారీగా పెరగటం, సబ్సిడీ మొత్తం బ్యాంక్ ఖాతాల్లో పడకపోవటంతో 'రీఫిల్' బుక్ చేయటం పడిపోయింది. 9.6 కోట్ల ఉజ్వల్ కనెక్షన్లలో సిలిండర్ రీఫిల్ బుక్ చేస్తున్నవారు కొద్దిమందే. నాలుగు అంతకన్నా తక్కువ సంఖ్యలో రీఫిల్ బుక్ చేసినవారు 56.5శాతం కాగా, ఒక్కసారి మాత్రమే రీఫిల్ కొనుగోలు చేసినవారు 11.3శాతం. పెరిగిన వంటగ్యాస్ ధరలు ఎంతగా బెంబేలెత్తిస్తున్నాయో ఇది ప్రత్యక్ష ఉదాహరణ. పీఎం ఉజ్వల్ యోజన పథకం ప్రయోజనాలు, లక్ష్యాలు కేవలం కాగితాలకే పరిమితం కాగా, పథకం నిర్దేశించిన వర్గాల్ని ఆదుకోలేకపోయింది.
న్యూఢిల్లీ : కోట్లాది మంది పేదలు, వలస కార్మికుల్ని ఆదుకుంటున్నామని మోడీ సర్కార్ (మే 2016లో) ప్రారంభించిన పథకం 'పీఎం ఉజ్వల్ యోజన'. ఎన్నికల్లో ప్రచారం కోసం, పార్లమెంట్లో, బడ్జెట్ ప్రసంగాల్లో ఘనంగా చెప్పుకోవడానికి తప్ప ఇంత మోసపూరిత పథకం మరోటి లేదు. ఈ పథకం కింద దాదాపు 9.6కోట్ల ఉజ్వల్ యోజన (వంటగ్యాస్) కనెక్షన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం సరఫరా అవుతున్న సబ్సిడీ వంటగ్యాస్ ధర రూ.1153లో సబ్సిడీ ఏమీ లేదు. పేరుకే ఇది సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్. ఉజ్వల్ కనెక్షన్లు తీసుకున్న పేదలు, వలస కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందని మే 2022లో కేంద్రం రూ.200 సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. ఇది కూడా సమయానికి రావటం లేదని లబ్దిదారుల నుంచి ఫిర్యాదులన్నాయి. అందువల్లే సిలిండర్ రీఫిల్ చేయలేక పోతున్నామని వారు వాపోతున్నారు.
కోట్లలో ఉజ్వల్ యోజన కనెక్షన్లను మంజూరుచేశామని కేంద్రం చెప్పుకోవటం తప్ప నిజమైన లబ్ది పేదలకు చేకూరటం లేదు. ఈ పథకం అమలుపై ఇటీవల బడ్జెట్ (2023-24) ప్రసంగం సందర్భం గా కేంద్రం గణాంకా లు విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం, ఫిబ్రవరి 1, 2023 నాటికి దేశంలో ఉజ్వల్ యోజన కనెక్షన్లు 9.6 కోట్లున్నాయి. కనెక్షన్ పొందాక తిరిగి రెండోసారి రీఫిల్ బుక్ చేయని లబ్దిదారులు 9.6శాతం మంది ఉన్నారు. ఒక్కసారి మాత్రమే రీఫిల్ బుక్ చేసినవారు 11.3శాతం. నాలుగు అంతకన్నా తక్కువసార్లు రీఫిల్ బుక్ చేసిన లబ్దిదారుల సంఖ్య 56.5శాతంగా ఉందని కేంద్రం తెలిపింది.
రీఫిల్ ఎందుకు బుక్ చేయటం లేదు?
పేదలు, వలస కార్మికుల కుటుంబాల్లో కట్టెల పొయ్యి వాడకాన్ని తగ్గించటం, ఎల్పీజీ వంటగ్యాస్ వైపు మరల్చడం ఉజ్వల్ యోజన పథకం ప్రధాన ఉద్దేశం. కేవలం ఈ వర్గాల్ని లక్ష్యంగా చేసుకొని పథకాన్ని రాష్ట్రాలు అమలు జేశాయి. పథకం ప్రారంభించిన 2016లో దేశమంతటా సిలిండర్ ధరలు సుమారుగా రూ. 527 వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఆ ధర రెట్టింపు అయ్యింది.
హైదరాబాద్ లో నేడు సబ్సిడీ సిలిండర్ ధర రూ.1150పైన్నే ఉంది. ఉజ్వల్ కనెక్షన్లకు రూ.200 రూపాయలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించినా, సిలిండర్ రీఫిల్స్ పెరగటం లేదు. వంటగ్యాస్ ధరలు పేదలు, వలసకార్మికుల్ని ఎంతగా బెంబేలెత్తి స్తున్నాయో పై గణాంకాలే చెబుతున్నాయి. వాస్తవానికి కేంద్రం ఇస్తామంటున్న రూ.200 సబ్సిడీ సమయానికి లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమకావటం లేదు.
బడ్జెట్ఏది?
సబ్సిడీతో కూడిన ఎల్పీజీ కనెక్షన్లకు 2023-24 బడ్జెట్లో కేంద్రం కేటాయించిన నిధులు కేవలం రూ.1లక్ష. నగదు బదిలీ కింద ఇవ్వాల్సిన సబ్సిడీకి కేటాయించిన నిధులు రూ.180 కోట్లు. క్రితం బడ్జెట్లో (2022-23) రూ.4వేల కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపారు. దీని ప్రకారం 95.5శాతం నిధులు తగ్గటం ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎత్తిచూపుతోంది.