Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రంగా గాయపడిన ఇద్దరు సైనికులు
కోల్కతా: బంగ్లాదేశ్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బందిపై బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన గ్రామస్థులు దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆదివారం జరిగింది. ఇక్కడి ముర్షీదాబాద్ జిల్లాలోని బెర్హంపుర్ సెక్టార్లో ఉన్న నిర్మల్చర్ ఔట్ పోస్ట్ వద్ద భారత్ వైపు ఉన్న పొలాల్లోకి పశువులను తరలించడానికి బంగ్లాదేశ్ రైతులు ప్రయత్నించారు. దీనిని అక్కడే గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బంది గమనించి, వారిని అడ్డగించారు. దీంతో రెచ్చిపోయిన ఆ మూక పదునైన ఆయుధాలు, కట్టెలతో భారత జవాన్లపై దాడికి పాల్పడింది. వీరికి సమీప బంగ్లాదేశ్ గ్రామం నుంచి వచ్చిన మరికొంతమంది తోడయ్యారు. మొత్తం వంద మంది పాల్గొన్న ఈ దాడిలో ఇద్దరు జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన వారు సిబ్బంది దగ్గర ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లారని వెల్లడించారు.