Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేల ఎర కేసు వివరాల వెల్లడిపై సుప్రీం అసహనం
- సీబీఐ చేతికిస్తే ఆధారాలు ధ్వంసం: దుష్యంత్ దవే
న్యూఢిల్లీ:తెలంగాణలో ఎమ్మెల్యే ల ఎర కేసుకు సంబంధించి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై అత్యు న్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎం అనుసరిం చిన పద్ధతి సరికాదని సుప్రీంకోర్టు సూచించింది. కేసు ఆడియో, వీడియోలను సీఎం ఎలా న్యాయమూర్తులకు పంపుతారని ప్రశ్నించింది. తెలంగాణలో ఎమ్మెల్యే ఎర కేసును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్ ల ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, దుష్యంత్ దవేలు వాదనలు వినిపించారు. సీబీఐ చేతిలోకి కేసు వెళ్తే..ఇప్పటి వరకు చేసిన విచారణ అంతా పక్కదారి పడుతుందని అన్నారు. ఈ కేసు విచారణను ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించొద్దని సుప్రీం కోర్టును కోరారు. ''కేంద్ర ప్రభుత్వం చేతిలో సీబీఐ పంజరంలో చిలకలాగా మారింది. ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచి ఒకసారి సమర్థించి మరోసారి వ్యతిరేకించింది. ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండ గానే బీజేపీ నేతలు దురుద్దేశపూర్వకంగానే మరో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. విచారణ సిబిఐ చేతికి వెళ్తే.. ఇప్పటి వరకు సేకరించిన అన్ని ఆధారాలు ధ్వంసం అవుతాయి. కేసు పూర్తిగా నీరుగారి పోతుంది'' అని అన్నారు. ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసుపై వాదించేందుకు తనకు మరింత సమయం కావాలని కోరారు. మరోవైపు కేసులో కీలక ఆధారాలు లీక్ చేశారన్న విషయాన్ని ప్రతివాదుల తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవారు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆధారాలను మీడియాకే కాదు.. జడ్జిలకు పంపారని అన్నారు. ఈ పద్ధతి సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. వాదనలు వినిపిస్తుండగానే కోర్టు సమయం ముగియడంతో మధ్యలోనే ధర్మాసనం విచారణ నిలుపుదల చేసింది. దీంతో కేసు తదుపరి విచారణపై సందిగ్ధత ఏర్పడింది.