Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన న్యాయస్థానం.. అది జాతీయ ప్రయోజనాల కోసం రూపొందించిందని పేర్కొంది. సాయుధ బలగాలను మరింత మెరుగుపరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని తీసుకువచ్చిందని.. అందులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. అగ్నిపథ్ నియామకం పద్ధతిని వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకూ వెళ్లింది. వీటిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. కేరళ, పంజాబ్, హరియాణా, బిహార్, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లోనూ దాఖలైన పిటిషన్లను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలో సూచించింది. ఇలా వచ్చిన పిటిషన్లపై గతేడాది డిసెంబర్ 15న విచారణ పూర్తిచేసిన దిల్లీ హైకోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతత్వంలోని ధర్మాసనం.. ఆ పథకంలో జోక్యం చేసుకునేందుకు ఎటువంటి కారణాలు కనిపించడం లేదంటూ వెల్లడించింది. సాయుధ బలగాల్లో నియామకాల కోసం జూన్ 14, 2022లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా 'అగ్నిపథ్' పథకాన్ని తీసుకువచ్చింది. నిబంధనల ప్రకారం.. 17 సంవత్సరాల ఆరు నెలల నుంచి 21సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువత దీనికి అర్హులు. అయితే, 2022లో నియామకానికి ఒక్కసారి మాత్రం గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు అనుమతించారు. అగ్నివీరులుగా ఎంపికైన వారికి నాలుగేళ్లపాటు శిక్షణ అనంతరం అందులో 25శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసు పరిధిలోకి తీసుకుంటారు. దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణ సహా బిహార్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే.