Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది. రాజధానిపై పిటిషన్లను త్వరగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కోరింది. త్వరగా వాదనలు ముగించాలని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం ముందు ఎపి ప్రభుత్వం తరపున న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, ఇతరులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుల విచారణ ఈ నెల 23న సుప్రీం కోర్టులో విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే ఒకసారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమంటూ ఈ నెల 14న సుప్రీం కోర్టు సర్క్యులర్ జారీ చేసింది. ఆ నేపథ్యంలో గత 23న రాజధాని కేసులు విచారణకు రాలేదు. అమరావతి కేసుల అంశాన్ని జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. సుప్రీం కోర్టు సర్క్యులర్ ప్రకారం గత గురువారం కేసులు విచారణకు రాలేదని, కోర్టుకు హోలీ సెలవుల అనంతరం (మార్చి 11న) వెంటనే విచారణ జాబితాలో చేర్చాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వాదనలకు ఎంత సమయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకరోజు సమయం పడుతుందని నిరంజన్ రెడ్డి బదులిచ్చారు. మార్చి 28న కేసుల విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది.