Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోట్లపై సావర్కర్ బొమ్మను ముద్రించాలి
- పార్లమెంటుకు వెళ్లే రోడ్డుకూ సావర్కర్ పేరు పెట్టాలి
- ఆలిండియా హిందూ మహాసభ డిమాండ్
న్యూఢిల్లీ : భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటీషు వారి ముందు తలొగ్గిన హిందూత్వ నాయకుడు సావర్కర్‌ను హీరోగా చిత్రీకరించేలా కాషాయశక్తులు చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా కొత్త డిమాండ్‌తో ముందుకొచ్చాయి. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ స్థానంలో సావర్కర్ బొమ్మను ముద్రించాలని ఆలిండియా హిందూ మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖను సైతం రాసింది. ఆలిండియా హిందూ మహాసభ చేసిన డిమాండ్ ప్రకారం.. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ స్థానాన్ని వి.డి సావర్కర్, ఇతర స్వాతంత్య్ర సమరయోధులతో భర్తీ చేయాలి. అలాగే, పార్లమెంటుకు వెళ్లే రోడ్డుకు సావర్కర్ పేరు పెట్టాలి. హిందూ మహాసభ మాజీ అధ్యక్షులు, స్వాతంత్య్ర సమరయోధులైన సావర్కర్‌కు మోడీ ప్రభుత్వం నుంచి లభించే నిజమైన నివాళి ఇదే అని హిందూ మహాసభ నాయకులు అన్నారు.
ఆలిండియా హిందూ మహాసభ డిమాండ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ మహాసభ డిమాండ్ ఏ మాత్రమూ ఆమోదయోగ్యము కాదని గాంధేయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సావర్కర్, గాడ్సే వంటి వారిని బీజేపీ, ఇతర హిందూత్వ శక్తులు కీర్తించడం.. అసలైన స్వాతంత్య్రసమరయోధులను కించపరిచినట్టే అవుతుందని ఆరోపించాయి. సోషల్ మీడియాలోనూ, పార్టీ, సంస్థల కార్యాలయాల్లో బీజేపీ నాయకులు, హిందూత్వ నాయకులు సావర్కర్, గాడ్సే వంటి వ్యక్తులను కీర్తిస్తున్నాయని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. జయంతి, వర్ధంతుల పేరిట వారిని గొప్ప వ్యక్తులుగా ప్రచారం చేస్తున్నాయని అన్నారు.