Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష నాయకులపై ఆయుధంలా సీబీఐ: సీపీఐ(ఎం)
- 'మోడీ- అదానీ' సంబంధాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే.. : సీఎం కేసీఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. 2021-22 ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటు చేసుకున్న వ్యవహారం సిసోడియాను ఆదివారం అరెస్టు చేసిన సీబీఐ అధికారులు సోమవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆప్ కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో భారీ భద్రత నడుమ సోమవారం మధ్యాహ్నం కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు ప్రాంగణంలోనూ, వెలుపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కేసులో తాము దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో నంబర్ 1 నిందితుడిగా సిసోడియాను పేర్కొన్నట్లు సిబిఐ తెలిపింది. మద్యం విధానం కోసం రూపొందించిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రా యాలను సిసోడియా తొలగించారని ఆరోపించింది. విచారణ సమయంలో తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని పేర్కొంది. విచారణ ముందుకెళ్లాలంటే సిసోడియాను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తిని సిసోడియా తరపు న్యాయవాది వ్యతిరేకించారు. సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టుకు తెలిపారు. 'సిసోడియా ఆర్థిక మంత్రి. బడ్జెట్‌ను సమర్పించాలి. దురుద్దేశంతోనే అరెస్టు చేశారు. ఈ కేసు అనేది ఒక వ్యక్తితో పాటు సంస్థపై దాడి. రిమాండ్‌ను తిరస్కరించాలి' అని తన వాదన వినిపించారు. అయినా సీబీఐ విజ్ఞప్తికి అంగీకరిస్తూ సిసోడియాకు ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో మంగళవారం నుంచి మార్చి 4 వరకు సిసోడియాను సీబీఐ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. సిసోడియా అరెస్టును నిరసిస్తూ ఆప్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యారు మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఘర్షణ జరిగింది. చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది లాఠీచార్జి చేశారు. పలువురు ఆప్ మద్దతుదారులను పారామిలటరీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో అరెస్టు చేశారని మండిపడ్డారు. చాలా మంది సీబీఐ అ ధికారులు మనీశ్ అరెస్టును వ్యతిరేకించారని పలువురు అధికారులు తనకు చెప్పారన్నారు. అధికారులందరికీ సిసోడియాపై అపారమైన గౌరవం ఉందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, అయితే ఆయనను అరెస్టు చేయాలని రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో అధికారులు రాజకీయ గురువులకు విధేయత చూపాల్సి వచ్చిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. శ్రీనగర్‌లో మార్చ్ చేయడానికి ఆప్ కార్యకర్తలు చేసిన ప్రయతాన్ని జమ్ముకాశ్మీర్ పోలీసులు భగం చేశారు. ముంబయిలోని బీజేపీ కార్యాలయం వెలుపుల నిరసన చేయడానికి వెళుతున్న ఆప్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఛండీగఢ్లోనూ ఆప్ ఆందోళనలు నిర్వహించిది.
ప్రతిపక్ష నాయకులపై ఆయుధంలా సీబీఐ
కేంద్రం తీరు సరికాదు..సీపీఐ(ఎం) ఖండన
ఢిల్లీ : ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఖండించింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఆయుధాలుగా మార్చే మోడీ ప్రభుత్వ ప్రాజెక్టులో సిసోడియా అరెస్టు ఒక భాగమని పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ నాయకులకు వ్యతిరేకంగా కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను అస్థిరపరచడం వంటివి జరుగుతున్నాయని తెలిపింది. ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుని మోడీ సర్కారు కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోందని విమర్శించింది. ప్రధాని, అధికార పార్టీలకు, అదానీ తదితర దాని అనుకూల బడా వ్యాపార సంస్థలకు మధ్య సంబంధాల విషయం చర్చనీయాంశం కావడం, అనేక ప్రశ్నలు ఎదురవుతుండడంతో వాటి నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంది.
ఇది ప్రజాస్వామ్యంపై దాడే . కేరళ సీఎం విజయన్
సిసోడియా అరెస్టుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. బీజేపీ అవలంభిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలన ఉపయోగించుకుంటున్నారన్న దానికి ఇదో ఉదాహరణ అని, దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఇది కఠోరమైన అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. ఇలాంటి అణచివేత మన దేశం పునాదిని దెబ్బతీస్తుంది, దీన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ ఎంపీ సంజరు సింగ్ స్పందిస్తూ వారు(బీజేపీ) ఆదర్శవంతమైన ప్రభుత్వాన్ని నడుపాలని కోరుకోవడం లేదని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడి భార్య భారతదేశానికి వచ్చి ఢిల్లీ ప్రభుత్వం నిర్మించిన పాఠశాలలు నిర్మించిన చూడాలని కోరుకున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన సమస్య ఢిల్లీ ప్రభుత్వ ప్రజాదారణ అని ఎంపీ సంజరు సింగ్ అన్నారు. దేశం మొత్తం లక్షల కోట్లు కొల్లగొట్టిన మోదీ మిత్రుడు అదానీ వైపు చూస్తోందన్నారు. అయినా సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్సీబీ, సెబీ మౌనంగా ఉన్నాయని విమర్శించారు. మనీష్ సిసోడియా ఢిల్లీలో లక్షలాది మంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించారన్నారు. బీజేపీకి భయపడేది లేదన్నారు.
'మోడీ- అదానీ' సంబంధాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే..సీఎం కేసీఆర్
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టును తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోడీ - అదానీ సంబంధాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సిసోడియాను అరెస్టు చేశారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. డిల్లీ మద్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత దీనిపై సీఎం కెసిఆర్ మొదటిసారి స్పందించడం గమనార్హం. ఎమ్మెల్సీ కవితపైనా విమర్శలు వచ్చినపుడు కూడా ఆయన నేరుగా స్పందించలేదు.
దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. విపక్షాలపైనా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిందని ఆరోపిస్తోంది. ఈ విషయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టే యోచనలో బిఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.