Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాసిక్‌లో రైతుకు దక్కేది కిలో ఉల్లికి రూ.1 మాత్రమే...
- 512 కిలోలు అమ్ముకుంటే..రూ.2 చెక్ అందుకున్న రైతు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కనిష్టస్థాయికి పడిపోయాయి. మార్కెట్లో పంటను అమ్ముకోలేక.. దిక్కుతోచని స్థితిలో ఉల్లి రైతు చిక్కుకున్నాడు. ఎంతోకొంత రాకపోతుందా? అని మార్కెట్‌కు తీసుకెళ్తే.. ఉల్లి ధర రైతుకు కన్నీరు తెప్పిస్తోంది. కిలో ఒక్క రూపాయి కాదు..రెండు రూపాయలకు అమ్ముకున్నా..రైతుకు దక్కేది సున్నా. మార్కెట్ ఛార్జీలు, కమిషన్ చూసుకున్నాక..ఉత్తచేతులతో రైతు ఇంటికి పోతున్నాడు. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి కొనుగోలు మార్కెట్ మహారాష్ట్ర నాసిక్ జిల్లా..'లాసాల్గావ్'లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఉల్లి రైతులకు మంగళవారం మార్కెట్లో లభించిన ధర కేవలం 'ఒక్క రూపాయి'. ఈ లెక్కన అమ్ముకుంటే, పంటను మార్కెట్‌కు తరలించిన వాహనం 'డీజిల్' ఖర్చు కూడా రాదని మహారాష్ట్రలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు పంటను రోడ్డుపైనే పారబోసి నిరసన వ్యక్తంచేస్తున్నారు.
గతకొన్ని రోజులుగా మార్కెట్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయనీ, దీనిపై అధికారులుగానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగానీ పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. మనదేశంలో పండిన పంట ఉత్పత్తులను అమెరికా, ఆస్ట్రేలియాకు పంపుతున్న రోజులివి. పక్కనున్న పాకిస్థాన్‌లో ఉల్లిగడ్డకు తీవ్ర కొరత ఉంది. అక్కడి ప్రజలు కిలో రూ.250 చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. మరోవైపు మనదగ్గర చూస్తే ఉల్లి ధర 'రూపాయి'కి పడిపోయింది. నాసిక్ మార్కెట్లో రైతులు నిరసనకు దిగుతున్నారు. ఈ ఒక్క రూపాయి కూడా ఎందుకు? అంటూ రోడ్డుమీద ఉల్లిని పారబోసి..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక రైతు 512 కిలోల ఉల్లి మార్కెట్‌కు తీసుకురాగా, కిలో 'ఒక్క రూపాయి' ధర దక్కింది. రూ.2 కోసం పోస్ట్ డేటెడ్ చెక్ రైతు చేతిలో పెట్టారు. ఇది కూడా రైతు బ్యాంక్ ఖాతాలో 15రోజుల తర్వాత జమవుతుంది.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రైతుకు న్యాయం చేసేలా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని సోషల్ మీడియాలో అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఉల్లి ధర విషయంలో కేంద్రం వెంటనే కలుగజేసుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని మహారాష్ట్రలో వ్యవసాయ మార్కెట్ అధికారులు, స్థానిక నాయకులు పలుమార్లు కోరారు. రైతుల నుంచి కొనుగోలు చేసినది..ఉల్లి దిగుబడి తక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేసుకునేలా ట్రేడర్స్‌కు అనుమతులు ఇవ్వాలని, తద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.