Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ కమిటీ సభ్యుడిదే పాత్ర : వినేష్ ఫోగట్
న్యూఢిల్లీ : డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలను పరిశీలిస్తున్న పర్యవేక్షణ కమిటీ సభ్యుడు మీడియాకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారని రెజ్లర్ వినేష్ ఫోగట్ పేర్కొన్నారు. అయితే లైంగిక వేధిపుల ఫిర్యాదులోని విషయాలను మీడియాకు లీక్ చేస్తున్నాడని, సభ్యునిపై చర్యల తీసుకోవాలని ఫిబ్రవరి 26 ఫోగట్ ట్వీట్ చేశారు. ఈ చర్య దర్యాప్తు నిష్పాక్షికతను ప్రభావితం చేయడమే కాకుండా, సభ్యుని నిర్లక్ష్య వైఖరి కారణంగా మహిళల గౌరవం, భద్రతను దెబ్బతీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ట్యాగ్ చేస్తూ సుధీర్ఘ పోస్ట్ చేశారు. దర్యాప్తు కమిటీలో రాజీపడుతున్న వ్యక్తి 'స్పోర్ట్స్ పర్సన్' అని ఫోగట్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ క్రీడాకారుడు రెండు కమిటీలలోనూ సభ్యుడిగా ఉన్నాడనీ, ఇవన్నీ కమిటీ కార్యకలాపాలపై తీవ్ర అపనమ్మకాన్ని కలిగిస్తాయని అన్నారు. న్యాయమైన, న్యాయబద్ధమైన విచారణ కోసం తాను చేసిన యత్నాలను బలహీనం చేయడమే కాకుండా, నిరాశకు గురిచేస్తున్నాయని ఫోగట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సభ్యుడిని కమిటీ నుంచి సత్వరమే తొలగించాలని కోరారు. ఈ సభ్యుడు మొదటి రోజు నుంచి మహిళల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడనీ, ఈ విషయంపై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్విటర్లో పేర్కొన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ ఎదుట రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్‌లు జనవరి 18న ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు పలువురు రెజ్లర్లు మద్దతు ప్రకటించిన విషయం విదితమే.. దీంతో ఈ ఆరోపణలను విచారించేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.