Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్-జనవరి మధ్య ద్రవ్యలోటు రూ.11.9లక్షల కోట్లు
- పన్ను రాబడులు రూ.16.88 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు, రాబడులపై మోడీ సర్కార్ చెబుతున్న లెక్కలు తారుమారు అవుతున్నాయి. 2022-23 పది నెలల (ఏప్రిల్-జనవరి) కాలంలో ద్రవ్యలోటు రూ.11.9 లక్షల కోట్లకు (67.8శాతం) చేరుకుంది. మొత్తం ద్రవ్యలోటు రూ.17.55 లక్షల కోట్లు ఉంటుందని కేంద్రం అంచనావేయగా, కేవలం 10 నెలల్లో 67.8శాతం ద్రవ్యలోటు నమోదైంది. దీని ప్రకారం కేంద్రం వేసిన అంచనా దాటిపోయే అవకాశం ఉంది. 2022-23 కేంద్ర బడ్జెట్ వ్యయం రూ.39.44లక్షల కోట్లు లక్ష్యాన్ని అందుకోవాలంటే రాబడులను పెంచుకోవాలి. ద్రవ్యలోటును చాలా వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి. ద్రవ్యలోటు చేయిదాటిపోతే, దాని ప్రభావం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై పడుతుంది. పెద్ద మొత్తంలో రుణాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 10 నెలల ద్రవ్యలోటు వివరాల్ని 'కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్' (సీజీఏ) మంగళవారం విడుదల చేసింది. మార్చి 31తో ముగిసేనాటికి ద్రవ్యలోటు జీడీపీలో 6.4శాతంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది. అంతక్రితం ఏడాది (2021-22) బడ్జెట్ (సవరించిన అంచనాలు)కు సంబంధించి మొదటి 10నెలల్లో ద్రవ్యలోటు 58.9శాతంగా ఉంది. దీంతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాదిలో ద్రవ్యలోటు అనూహ్యంగా 67.8శాతానికి చేరుకుంది.
పది నెలల్లో పన్ను వసూళ్లు (10 నెలల్లో) రూ.16,88,710 కోట్లుగా ఉంది. మొత్తం బడ్జెట్ వ్యయం రూ.39.44లక్షల కోట్లు ఉంటుందని అంచనావేస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్రం 2023-24 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ద్రవ్యలోటును జీడీపీలో 5.9శాతానికి పరిమితం చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ తన ప్రసంగంలో చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు జీడీపీలో 6.4శాతానికి పరిమితమవుతుందని అన్నారు. 2025-26నాటికి ద్రవ్యలోటును 4.5శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ద్రవ్యలోటుపై సీజీఏ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 4.5శాతానికి పరిమితం చేయటమనే లక్ష్యం దాదాపు అసాధ్యంగా కనపడుతోంది.