Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022లో 8.8శాతం తగ్గుదల : ఆంగ్ల దినపత్రిక కథనం
- 2018-22 మధ్య కేంద్ర నియామకాలు 5.52లక్షలు
- రాష్ట్రాల్లో 24 లక్షల ఉద్యోగాల కల్పన
న్యూఢిల్లీ : క్రితం ఏడాదితో పోల్చితే 2022లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ కల్పన 2022లో 8.8శాతం తగ్గుదల నమోదైందని ఒక ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా..ప్రభుత్వ ఉద్యోగ నియామకం జరిగితే, ఆ నియామకానికి సంబంధించి 'నూతన పెన్షన్ పథకం'లో నమోదుచేయాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర నియామకాల వివరాల్ని 'ఎన్పీఎస్' చందాదార్ల (సబ్స్క్రిప్షన్ల) వివరాలతో తెలుసుకోవచ్చునని వార్తా కథనం పేర్కొంది. ఎన్పీఎస్ చందాదార్ల సంఖ్య ప్రకారం, 2021లో కొత్త సబ్స్క్రిప్షన్లు 6,19,835 ఉన్నాయి. 2022నాటికి ఆ సంఖ్య 5,65,500కి మాత్రమే పరిమితమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగ కల్పనలో వృద్ధి 8.8శాతం పడిపోయిందని వార్తా కథనం వివరించింది. 2018-22 మధ్యకాలంలో కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 5,52,510. ఇదే కాలంలో రాష్ట్రాల్లో 24 లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.
ఎన్పీఎస్ రద్దు చేసి..పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నాయి. ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖాండ్, పంజాబ్లో ఎన్పీఎస్ను రద్దు చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. సైనిక బలగాల్లో పనిచేసిన వారికి తప్ప, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రస్తుతం ఎన్పీఎస్ అమలవుతోంది. ఈ పథకం 2004 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ఒక అంచనాకు రావడానికి 'ఎన్పీఎస్ చందాదార్ల' గణాంకాలు ఉపయోగపడతాయని వార్తా కథనం అభిప్రాయపడింది. ఎన్పీఎస్లో యువ చందాదార్ల (18-28 సంవత్సరాలు) వాటా 2021లో 67.8శాతం ఉండగా, 2022లో 5.2శాతం తగ్గింది. మొత్తం చందాదార్లలో కేంద్రం వాటా 2021లో 1,23,665 కాగా, 2022లో 1,18,020గా ఉంది.