Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ3లో వృద్ధి 4.4 శాతమే
- జీడీపీకి అధిక ధరల పోటు
న్యూఢిల్లీ : భారత దేశ ప్రగతి క్రమంగా కుంటు పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.4 శాతానికి పడిపోయిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. 2022 జూన్ నుంచి ఆగస్టుతో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ 6.3 శాతంకాగా, ఇంతక్రితం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ రెండు త్రైమాసికాలతో పోల్చితే గడిచిన క్యూ3లో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని చవి చూసిందని స్పష్టమవుతున్నది. భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని బీజేపీ పాలకులు చేస్తున్న ప్రచారానికి తాజా గణాంకాలు షాకిస్తున్నాయి.
గడిచిన క్యూ3లో 2011-12 వాస్తవ ధరల ప్రాతిపాదికన వాస్తవిక జీడీపీ విలువ రూ.40.19 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2011-12 ఇదే క్యూ3లో రూ.38.51 లక్షల కోట్లుగా ఉంది. దీంతో పోల్చితే గడిచిన క్యూ3లో 4.4శాతం వృద్ధి చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత వృద్ధిరేటు 7శాతంగా ఉండొచ్చని గణంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021-22 జీడీపీ గణంకాలను 8.7శాతం నుంచి 9.1శాతానికి సవరించింది. దేశంలోని అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా పెంచిన వడ్డీ రేట్లు జీడీపీ వృద్ధి రేటును దెబ్బతీశాయి. హెచ్చు ధరల వల్ల దేశంలో వస్తువులకు డిమాండ్ పడిపోయింది. ఈ ప్రభావం తయారీ ఇతర రంగాలపై ఎక్కువగా పడింది.
ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన తయారీ రంగం పేలవ ప్రదర్శన కనబర్చింది. గడిచిన క్యూ3లో ఈ రంగం 1.1 శాతానికి క్షీణించింది. ఇంతక్రితం క్యూ2లో ఇది 3.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మరోవైపు వ్యవసాయ రంగం మాత్రం క్యూ2లో 2.4 శాతం పెరగ్గా.. క్యూ3లో 3.7 శాతం వృద్ధిని కనబర్చింది. విద్యుత్, నిర్మాణ రంగాలు వరుసగా 8.2శాతం, 8.4శాతం పెరుగుదలను నమోదు చేశాయి. హోటళ్లు, రవాణ రంగం క్యూ2లో 15.6 శాతం వృద్ధిని సాధించగా.. క్యూ3లో 9.7 శాతానికి పడిపోయాయి. రక్షణ రంగం 5.6 శాతం నుంచి 2శాతానికి క్షీణించింది. 2022-23లో భారత జీడీపీ 7 శాతం వృద్ధిని కనబర్చనుందని ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. దీనికి భిన్నంగా ఫలితాలు చోటు చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ఆందోళన పెంచుతోంది.