Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ బడ్జెట్ ప్రజావ్యతిరేకం
- ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు : ఏచూరి
న్యూఢిల్లీ : దేశంలో మోడీ సర్కార్ ప్రజల జీవనోపాధిపై నిరంతరం దాడులు చేస్తున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం, అసమానతలతో పాటు, కేంద్రం తన విధానాలతో ప్రజల జీవనోపాధిపై నిరంతరం దాడులు చేస్తున్నదనీ, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌గా ఉందన్నారు. ప్రయివేటీకరణ పేరుతో ప్రజల సొత్తుగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను కొందరికి ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి బడా పెట్టుబడిదారుల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం, ప్రజా ఆస్తులను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం వల్ల కరోనా మహమ్మారి తరువాత కూడా దేశంలో ట్రిలియనీర్ల సంఖ్య పెరుగుతున్నదని అన్నారు. మోడీ ప్రభుత్వం అభివృద్ధి కొలమానం చెబుతున్నది ఇదేనని ఎద్దేవా చేశారు. మరోవైపు గత రెండేండ్లలో 23 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువకు వెళ్లిపోయారని పేర్కొన్నారు.
ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతున్నదని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచకుండా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టలేమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెట్టుబడులను పెంచకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదన్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, మందులపై జీఎస్టీ విధించి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని తెలిపారు. చౌకగా ఇస్తున్న రేషన్‌ను కూడా ఈ బడ్జెట్లో తీసేశారని, సబ్సిడీలకు కోత విధించారని విమర్శించారు. ఉపాధి హామీకి నిధులు తగ్గించారనీ, ఎరువుల సబ్సిడీకి కోత విధించారని అన్నారు. దీనివల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు, పేద ప్రజలపై ప్రభావం పడుతున్నదని తెలిపారు. మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా పెరుగుతున్న సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితమై వీధుల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వామపక్షాలతో పాటు ఇతర ప్రజాతంత్ర శక్తులు ఏకమై బీజేపీని ఓడించాలని, ఇదే నేటి దేశభక్తి అని పేర్కొన్నారు. ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీతో పాటు ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆశా శర్మ, సాహబా ఫరూఖీ, సుబీర్ బెనర్జీ ప్రసంగించగా, అనురాగ్ సక్సేనా అధ్యక్షత వహించారు.