Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరిలో 7.45 శాతం నమోదు
- హర్యానాలో అత్యధికం...ఛత్తీస్గఢ్ అత్యల్పం
న్యూఢిల్లీ : దేశంలోని నిరుద్యోగ రేటు మళ్లీ పెరిగింది. ఫిబ్రవరిలో 7.45 శాతం నమోదు అయింది. ఈమేరకు బుధవారం సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 7.45 శాతం నిరుద్యోగ రేటు నమోదు అయింది. పట్టణ నిరుద్యోగ రేటు 7.93 శాతం కాగా, గ్రామీణ నిరుద్యోగం 7.23 శాతం నమోదు అయింది. జనవరిలో 7.14 శాతం నిరుద్యోగ రేటు ఉండగా, అది ఫిబ్రవరి నాటికి 7.45 శాతానికి పెరిగింది. దేశంలో అత్యధికంగా నిరుద్యోగ రేటు నమోదు అయిన రాష్ట్రాల్లో 29.4 శాతంతో హర్యానా మొదటి స్థానంలో నిలిచింది. 28.3. శాతంతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. 21 శాతంతో సిక్కిం, 17.1 శాతంతో జమ్మూ కాశ్మీర్, 16.8 శాతంతో జార్ఖండ్, 13.9 శాతంతో హిమాచల్ ప్రదేశ్, 12.3 శాతంతో బీహార్, 11.7 శాతంతో త్రిపుర, 11.1 శాతంతో గోవా, 8.6 శాతం ఢిల్లీ, అసోం, 8.2 శాతంతో పంజాబ్ తరువాత స్థానాల్లో నిలిచాయి. మిగిలిన రాష్ట్రాలన్నీ జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటును నమోదు చేసుకున్నాయి. 0.8 శాతంతో ఛత్తీస్గఢ్ అత్యల్ప నిరుద్యోగ రేటు నమోదు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం స్వల్పంగా..
తెలుగు రాష్ట్రాలల్లో ఆంధ్రప్రదేశ్లో 6.6 శాతంతో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదు అయింది. అయితే ఏపీలో జనవరి నెలలో 5.5 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, ఫిబ్రవరి నాటికి 6.6 శాతానికి పెరిగింది. తెలంగాణలో 5.8 శాతంతో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదు అయింది. అయితే గత నెల (జనవరి) కంటే ఇప్పుడు కాస్తా పెరిగింది. జనవరిలో 5.3 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, ఫిబ్రవరిలో 5.8 శాతానికి పెరిగింది.