Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పని తెలిసినా బొగ్గు తవ్వకాలకు అనుమతులు
- 2014లో బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు
- ఆ తర్వాత ప్రత్యేక నిబంధనతో అదానీ గ్రూపునకు మినహాయింపు
- 450 మిలియన్ టన్నుల మైనింగ్‌కు లైన్ క్లియర్
- ఇప్పటి వరకు 80 మిలియన్ టన్నులు వెలికితీత
- మోడీ-అదానీ బంధంపై 'అల్‌జజీరా' ప్రత్యేక కథనం
భారత్‌లో వివాదాస్పద బడా వ్యాపారవేత్త అదానీకి సంబంధించిన అవకతవకలపై పలు విషయాలు బయటపడుతున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక నుంచి ఇప్పటి వరకు.. రోజుకో వార్తా సంస్థ తమ ప్రత్యేక కథనాలతో ముందుకొస్తున్నాయి. దేశంలో అదానీ బొగ్గు వ్యాపార సామ్రాజ్యం విస్తృతం కావడానికి మోడీ సర్కారు చేసిన సాయంపై 'అల్‌జజీర' వార్త సంస్థ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందులో దోస్తు అదానీ కోసం ప్రధాని మోడీ చేసిన అసాధారణ సహాయాన్ని వివరించింది.
న్యూఢిల్లీ : మోడీ సర్కారు అండదండలతో అదానీ వ్యాపారం అంతర్జాతీయంగా విస్తరించింది. ప్రభుత్వ పోర్టులు, విమానాశ్రయాలు మొదలుకొని బొగ్గు గనుల తవ్వకాల వరకు అదానీ గ్రూపు గుత్తాధిపత్యాన్ని సాధించింది. ముఖ్యంగా, దేశంలో బొగ్గు గనుల తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునూ కాదని మోడీ సర్కారు ప్రత్యేక నిబంధనలతో అదానీ గ్రూపునకు అసాధారణ
సాయాన్ని అందించింది. వీటికి సంబంధించిన పత్రాలను లాభాపేక్ష లేని మీడియా సంస్థ 'ది రిపోర్టర్స్ కలెక్టివ్ (టీఆర్సీ)', అల్జజీరాలు సంపాదించాయి.
'అల్‌జజీర' కథనం ప్రకారం.. బొగ్గు బ్లాకులను ప్రయివేటు రంగానికి అప్పగించే ప్రత్యేక నిబంధన సరికాదనీ, ఇందులో పారదర్శకత లోపించిందని ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ధారించింది. అయినప్పటికీ కేంద్రం అదానీ కోసం మినహాయింపును కల్పించింది. భారత్‌లోని అత్యంత దట్టమైన అటవీ ప్రాంతాలలో 450 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గును కలిగి ఉన్న బ్లాక్ నుంచి తవ్వకాలు జరుపుకోవడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు అనుమతించింది. అయితే ఈ మినహాయింపును అదానీకి చెందిన గ్రూపునకే ఎందుకు ఇచ్చారో ప్రభుత్వం వివరించకపోవడం గమనార్హం.
2014లో కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూపునకు బొగ్గు వ్యాపారంలో ఆధిపత్యం చలాయించే అవకాశం లభించినట్టయింది. 204 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేస్తూ 2014లో సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక బొగ్గు బ్లాక్‌ల కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని కోర్టు గుర్తించింది. ఈ విధంగానే అప్పట్లో ఒక అక్రమ కాంట్రాక్టును ఒకటి అదానీ గ్రూపు పొందింది. చట్ట సభల అనుమతి లేకుండా ఇదంతా సాగిందని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. చివరకు అన్ని బొగ్గు బ్లాక్‌లను, అప్పగించిన మైనింగ్ కాంట్రాక్టులను రద్దు చేసి కంపెనీలను బలవంతంగా జప్తు చేసింది. దీంతో అదానీ గ్రూపునకు ఎదురుదెబ్బ తాకింది. ఆ తర్వాత అదానీ కోసం మోడీ సర్కారు రంగప్రవేశం చేసింది. కోర్టు తీర్పును అనుసరించి అదానీకి లబ్ది చేకూరేలా ఒక నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ నిబంధన అదానీ గ్రూపునకు మైనింగ్ నుంచి మినహాయింపును ఇచ్చింది. అయితే, మోడీ ప్రభుత్వ నిర్ణయంతో అదానీ గ్రూపు వ్యాపార సంపద అమాంతంగా పెరిగింది. కోర్టు తీర్పు నేపథ్యంలో అదానికి అనుకూలంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక నిబంధనలు ఇతర ప్రయివేటు కంపెనీలను నష్టాల్లోకి నెట్టాయి. అదానీ గ్రూపునకు మాత్రం కావాల్సినంత లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ రోజు వరకు అదానీ గ్రూపు సదరు బ్లాక్ నుంచి 80 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును తవ్వింది. యూపీఏ హయాంలో బొగ్గు కుంభ కోణం మొత్తం దేశాన్ని అంధకారంలోకి నెట్టింది అని 2014 సాధారణ ఎన్నికలకు ముందు మోడీ తన ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనపై విమర్శలు సంధించారు. ఏఐసీసీని 'ఆలిండియా కోల్ కాంగ్రెస్‌గా' సైతం ఆ సమయంలో మోడీ అభివర్ణించారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కారు అదానీ విషయంలో అంతకు మించి వ్యవహరించింది. బొగ్గు వ్యాపార సామ్రాజ్యంలో బడా పారిశ్రామికవేత్తలకు హద్దు మీరి, నిబంధనలను పాతర పెట్టి మరీ సాయం చేసింది. అదానీ గ్రూపునకే కాకుండా ఆర్పీ సంజీవ్ గోయెంకా (ఆర్పీఎస్జీ)కి మోడీ ప్రభుత్వం అండగా నిలిచింది. బొగ్గు గనిని తిరిగి పొందేందుకు డొల్ల కంపెనీలను ఉపయోగించు కోవడానికి ఆర్‌పీఎస్‌జీకి కూడా అనుమతిని ఇచ్చింది. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూపు సాగించిన డొల్ల వ్యాపారం గుట్టు బయటి ప్రపంచానికి తెలిసిన విషయం విదితమే. బ్యాంకు రుణాలు, అప్పుల మీద విస్తరించిన వ్యాపారం అదానీని దేశంలోనే అత్యంత సంపన్నుడిగా, ప్రపంచంలోనే టాప్-3 స్థానానికి తీసుకెళ్లింది. అయితే, హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం ఆయన వ్యాపార షేర్ల విలువ పడిపోయింది. ప్రపంచ సంపన్నుడిగా ఆయన ర్యాంకు టాప్ 3 నుంచి 30వ స్థానానికి పడిపోయింది.
2014 సుప్రీం తీర్పు తర్వాత కూడా రెండు బొగ్గు బ్లాక్‌లకు ఎండీఓ గా అదానీ గ్రూపు నిలిచిన తీరు
2006(మే) : బొగ్గు తవ్వకాల కోసం జాయింట్ వెంచర్(జేవీ)కి టెండర్ ఆహ్వానించిన రాజస్థాన్ ప్రభుత్వ రంగ యూనిట్ ఆర్ఆర్వీయూఎన్ఎల్
2006 (ఆగస్టు): ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (సీఎస్పీజీసీ)కి పర్సా బొగ్గు బ్లాక్‌ను కేటాయించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ
2007(జూన్): పీఈకేబీ బొగ్గు బ్లాక్‌ను ఆర్ఆర్వీయూఎన్ఎల్కు
కేటాయించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
2007(అక్టోబర్): అదానీ గ్రూపుతో కలిసి ఆర్ఆర్వీయూఎన్ఎల్ జేవీ ఏర్పాటు : ఈ జేవీలో అదానీ ఈక్విటీ 74 శాతం
2009(జులై): పీఈకేఈబీ బ్లాక్‌కు ఎండీఓగా అదానీ గ్రూపును నియమించిన ఆర్ఆర్వీయూఎన్ఎల్-అదానీ జేవీ
2010(డిసెంబర్): సీఎస్పీజీసీతో జేవీ ఏర్పాటు చేసిన అదానీ గ్రూపు, పర్సా బ్లాక్‌కు ఎండీఓగా అదానీ గ్రూపు నియామకం
2013 : పీఈకేబీ బొగ్గు బ్లాక్‌లో మైనింగ్ పనులు షురూ
2014(ఆగస్టు): పీఈకేబీ, పర్సాలతో పాటు 204 బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులు రద్దు చేసిన సుప్రీం
2015(మార్చి): పాత ఎండీఓ కాంట్రాక్టులు పునరుద్ధరించేలా బొగ్గు తవ్వకాల ప్రత్యేక నిబంధనల చట్టం తీసుకొచ్చిన మోడీ సర్కారు
2015(మార్చి): ఆర్ఆర్వీయూఎన్ఎల్కు పీఈకేబీ తిరిగి కేటాయించిన బొగ్గు మంత్రిత్వ శాఖ, ఎండీవోగా మళ్లీ అదానీ
2015(ఫిబ్రవరి-మార్చి): అదానీ సిఫారసు మేరకు పర్సా బ్లాక్ కేటాయింపు కోసం ఆర్ఆర్వీయూఎన్ఎల్ దరఖాస్తు చేసి చేజిక్కించుకోవడం, కొత్త ఆక్షన్ లేకుండానే అదానీని ఎండీవోగా నియమించిన జేవీ
2020(మార్చి): ఎండీవోల నియామకాన్ని అంతర్గతంగా తప్పుబట్టిన పీఎంఓ
2020(ఆగస్టు-అక్టోబర్): 2014కు ముందున్న ఒక్క ఎండీవో (పీఈకేబీ బ్లాక్‌కు అదానీ గ్రూపు) ఒప్పందమే కొనసాగుతున్నదని తెలిపిన ప్రభుత్వాధికారులు.. ఇలాంటి ఒప్పందాలు భవిష్యత్తులో జరగవని స్పష్టీకరణ