Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు రాబోతున్నాయి. మూడు రాష్ట్రాల్లో మొత్తం 178 స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ నేడు ఉదయం 8 గంటలకే ప్రారంభం కానున్నది. త్రిపుర-60, మేఘాలయ-59, నాగాలాండ్-59 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 16 నుంచి 27 మధ్య పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్నదని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా త్రిపురలో వామపక్ష కూటమికి, బీజేపీ కూటమికి మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా నెలకొంది. వీటి ఫలితాలు ఏవిధంగా వస్తాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ మొత్తం 60 స్థానాలుండగా, వామపక్షాలు 47 స్థానాల్లో, కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీచేశాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ 36 స్థానాలు గెలుచుకొని, ఐపీటీఎఫ్తో జతకట్టి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 55 స్థానాల్లో బీజేపీ, ఆరు స్థానాల్లో ఐపీటీఎఫ్ అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది.
గత ఐదేండ్లుగా బీజేపీ పాలనతో త్రిపుర ప్రజలు విసుగెత్తిపోయారు. దాడులు, విధ్వంసంతో ప్రతిపక్షాల్ని అణచివేయటమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగింది. ప్రస్తుత ఎన్నికల నిర్వహణ స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే పరిస్థితులు కరువయ్యాయని ప్రతిపక్షాలు అనేకమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరిగేట్టు చూడాలని వామపక్షాలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆశ్రయించాల్సి వచ్చింది. అధికార బీజేపీ పాలనపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నా, అది ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రతిబింబిస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోరులో దిగిన వామపక్షాల అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27 పోలింగ్ చేపట్టారు. మేఘాలయ సీఎం కాంన్రాడ్ సంగ్మా (పి.ఎ.సంగ్మా కుమారుడు) నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అన్ని స్థానాల్లో పోటీ చేసింది. సంగ్మా పార్టీతో సంబంధాలు దెబ్బతినటంతో బీజేపీ 59స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో నిలిపింది. తృణమూల్ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. నాగాలాండ్‌లోనూ నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెస్సీవ్ పార్టీతో బీజేపీ చేతులు కలిపింది. తద్వారా 2018లో అధికారాన్ని కైవసం చేసుకుంది. జనతాదళ్ (యునైటెడ్), ఒక స్వతంత్ర అభ్యర్థి సాయంతో నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.