Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏ పార్టీకీ రాని స్పష్టమైన మెజారిటీ
- త్రిపురలో బీజేపీ కూటమికి మెజారిటీ
- గత ఎన్నికల కంటే 11 స్థానాలు తగ్గుదల
- నాగాలాండ్‌లో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి విజయం
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మేఘాలయలో 59 స్థానాలకు గానూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అత్యధికంగా 26 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక త్రిపురలో 60 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార బీజేపీ కూటమి 33 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీని సాధించింది. నాగాలాండ్‌లోనూ 60 స్థానాలకు నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెస్సివ్ పార్టీ(ఎన్డీపీపీ)-బీజేపీ కూటమి 37 స్థానాల్లో విజయం సాధించి రెండో సారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. త్రిపురలో గత నెల 16న, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో గతనెల 27న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే.
మేఘాలయలో బీజేపీకి షాక్
మేఘాలయలో గత ఎన్నికల్లో ఎన్‌పీపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బ ఎదురైంది. ఎన్‌పీపీతో విభేదాలు రావడంతో బీజేపీ మేఘాలయలో ఒంటరి పోరుకు సిద్ధమైంది. మొత్తం 59 స్థానాలకు కాషాయ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టింది. కేవలం ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. ఇక ఎన్పీపీ గత ఎన్నికల కంటే 6 సీట్లను పెంచుకొని 26 స్థానాలను కైవసం చేసుకున్నది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక యూడీపీ 11 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 5 సీట్లలో, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు.
59 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 30కి పైగా స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. మొత్తమ్మీద ఏ పార్టీ కూడా అధికారానికి కావాల్సినన్ని స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీంతో మేఘాలయ రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే, తుది ఎన్నికల ఫలితాల అనంతరం ముందుకు ఎలా వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామనీ ఎన్పీపీ చీఫ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంన్రాడ్ సంగ్మా అన్నారు. మేఘా లయలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్పీపీకి మద్దతు తెలపాలనీ ఆ రాష్ట్ర బీజేపీకి మా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారని అసోం సీఎం హిమంత విశ్వ శర్మ ట్వీట్ చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ సీఎం కాన్రాడ్ సంగ్మా కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారని వివరించారు. బీజేపీ ఎన్పీపీకి మద్దతు తెలిపినా బలం 28కే చేరుతుం డటం గమనార్హం. గత ఎన్నికల్లో ఎన్పీపీ, బీజేపీ కూటమి.. యూడీపీ, ఇతరులతో కలిసి మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
త్రిపురలో బీజేపీ కూటమికి తగ్గిన స్థానాలు
త్రిపురలో తిరుగులేదనీ, అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని ధీమాతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో కంటే 11 స్థానాలను తక్కువగా పొందింది. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోరు వామపక్ష కూటమి, బీజేపీ కూటమికి మధ్య హోరాహోరీగా సాగింది. ఓటర్లను, అభ్యర్థులను బెదిరిం చడం.. రిగ్గింగ్‌కు పాల్పడటం.. ముఖ్యంగా వామపక్ష కూటమి అభ్యర్థులపై దాడికి తెగబడటం, అధికార దుర్వినియోగం వంటి చర్యలకు బీజేపీ దిగింది. అధికారులు కూడా ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిం చడం వంటి ఘటనలు త్రిపుర ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి.
అయినప్పటికీ బీజేపీ పార్టీకి గత ఎన్నికల కంటే స్థానాలు తగ్గాయి. గత ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీ (ఇండీజీనియస్ ప్రొగ్రెస్సివ్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమికి మొత్తం 44 స్థానాలు (బీజేపీకి 36, ఐపీఎఫ్‌టీకి 8) రాగా.. ప్రస్తుతం 11 స్థానాలు తగ్గి అది 33కి పరిమితమైనా రాష్ట్రంలో రెండో సారి అధికారాన్ని చేపట్టనున్నది. వామపక్ష, కాంగ్రెస్ కూటమి 14 సీట్లలో విజయం సాధించింది. ప్రత్యేక రాష్ట్ర సాధన డిమాండ్‌తో తొలి సారిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన టిప్రా మోతా చక్కటి ప్రదర్శనను కనబర్చింది. మొత్తం 13 స్థానాలను గెలుచుకొని బీజేపీ కూటమికి గట్టి షాక్ ఇచ్చింది. ఐపీఎప్టీ ఓట్లను టిప్రా మోతా చీల్చి ఈ సీట్లను గెలిచిందని విశ్లేషకులు తెలిపారు.
నాగాలాండ్‌లో..
నాగాలాండ్‌లో మొత్తం 59 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 40:20 నిష్పత్తిలో సీట్ల పంపకం జరుపుకొని పోటీ చేశాయి. ఎన్డీపీపీ 25 స్థానాలు, బీజేపీ 12 స్థానాలు గెలుచుకొని రెండో సారి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీపీపీ, బీజేపీ.. జేడీ(యూ), ఇండిపెండెంట్ సాయంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.