Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వం
న్యూఢిల్లీ : అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ నియమించింది. అదానీ-హిండెన్ బర్గ్ వివాదంపై దాఖలైన నాలుగు పిటిషన్ల బ్యాచ్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దీవాలాలతో కూడిన అత్యున్నత ధర్మాసనం గురువారం ప్యానెల్‌ను ఏర్పాటుచేసింది. ప్రస్తుత కమిటీకి సప్రే నాయకత్వం వహిస్తుండగా.. ముంబయి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జెపి దేవధర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మెన్ ఓపి భట్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, బ్యాకింగ్ దిగ్గజం కెవి కామత్, కార్పొరేట్ న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్‌లను కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ ప్యానెల్‌కు అన్నివిధాలా సహకారాన్ని అందించాలని కేంద్రంతోపాటు, ఆర్థిక చట్టబద్ధమైన సంస్థలను, సెబీ చైర్‌పర్సన్‌ను ధర్మాసనం ఆదేశించింది. సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని, రెండు నెలల్లో విచారణ జరిపి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. రెగ్యులేషన్ నిబంధనల ఉల్లంఘన ఉంటే కచ్చితంగా సెబి విచారణ చేపట్టాలని పేర్కొంది. ఈ విషయంలో గతంలో కేంద్రం సీల్డ్ కవర్లో పంపిన ప్రతిపాదనలను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే.