Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాల ఇండ్లపై బీజేపీ గూండాల దాడులు
అగర్తలా : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరు క్షణం నుంచే బీజేపీ గూండాలు ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. సీపీఐ(ఎం), ఇతర ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల ఇండ్లపైన , పార్టీ కార్యాలయాలపైన హింసాత్మక దాడులకు దిగారు. ఈ దాడుల్లో సబ్ డివిజనల్ పోలీసు అధికారితో సహా 25మంది గాయపడ్డారు. అగర్తలాలోని బదర్ఘాట్ ఏరియాలో సీపీఐ(ఎం) కార్యకర్త ఇంటిపై బీజేపీ ముష్కరులు దాడి చేశారు. అప్పటికే ఆ కార్యకర్త తన కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఆయన ఇంటిని కాషాయ మూకలు తగులబెట్టాయి. ఇటువంటి దాడులే మోహన్పూర్, సూర్యమణి నగర్, రామ్నగర్, బెలోనియా, సోనామురా తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తిప్రా మోతా కార్యకర్తల ఇళ్లపైనా దాడులకు పాల్పడడంతో వారు ప్రతిదాడులకు దిగారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలియామురా, కృష్ణపూర్ నియోజకవర్గాల్లో తిప్రా మోతా పార్టీ మద్దతుదారుల ఇండ్లపై ౖ దాడులు జరిగాయి.
ఈ దాడిలో తెలియమురా సబ్ డివిజనల్ పోలీసు అధికారి ప్రసూన్ కాంతి తలకు తీవ్ర గాయమైంది. ఆగ్రహించిన తిప్రా మద్దతుదారులు బీజేపీ మండల కార్యాలయంపై దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, పోలీసులపై కూడా వారు దాడి చేశారు. ఇలాగే దక్షిణ త్రిపురలోని శాంతిబజార్, సెఫాయిజలా జిల్లాలోని బిషల్ఘర్ల్లో కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎస్డీఎం కార్యాయాలను, కొన్ని వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడి చేసినవారిని వదిలేసి బాధితులపైనే లాఠీచార్జికి దిగారు. దొంగే దొంగ అన్న చందంగా బీజేపీ కార్యకర్తలపై ప్రతిపక్షాలే దాడులకు దిగుతున్నాయని పాలక పార్టీ ఎదురు దాడి చేసింది.
గురువారం ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే, బిషాల్ఘర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇంటిపై కొందరు దుండగులు బాంబులు విసిరారు. ఇక్కడ గెలుపొందిన బీజేపీ అభ్యర్ధి సుశాంత దేవ్ మాట్లాడుతూ, మోతా కార్యకర్తలు అకస్మాత్తుగా తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసానికి దిగారని, పదిమంది పార్టీ కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని రవిదాస్పరా ప్రాంత ప్రజలు సీపీఐ(ఎం)కి ఓటు వేశారని ఆరోపిస్తూ బీజేపీ మద్దతుదారులు దాడికి దిగారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఫిబ్రవరి 16న పోలింగ్ తర్వాత కూడా దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటివరకు ఈ దాడుల్లో 52మందికి పైగా గాయపడ్డారు.