Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితి తీవ్రం
- బీజేపీ పాలనలో పెరిగిన దాడులు
- తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశంలో విద్యా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నది. ఆలోచనలను, వాస్తవాలను నిర్భయంగా వెల్లడించే పరిస్థితులు దేశంలోని విద్యాసంస్థల్లో కనిపించడం లేదు. బీజేపీ సర్కారు హయాంలో విద్యా స్వేచ్ఛపై దాడులు పెరిగి రక్షణ కరువైంది. 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ ధోరణి మరింతగా కొనసాగింది. అంతర్జాతీయ పరిశోధకుల గ్రూపు తయారు చేసిన ఒక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 2917 మంది నిపుణుల ద్వారా ''అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అప్డేట్ 2023'' పేరిట ఈ నివేదికను రూపొందించారు.
ఈ నివేదిక ప్రకారం.. భారత్, యూఎస్ఏ, మెక్సికో వంటి 22 దేశాల్లో విద్యా స్వేచ్ఛ ఆందోళనకరంగా ఉన్నది. ఇక్కడి యూనివర్సిటీలు, స్కాలర్ల విద్యా స్వేచ్ఛ గణనీయంగా తగ్గింది. గత పదేండ్ల కంటే కూడా ఇది తక్కువగా ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 179 దేశాలో భారత ర్యాంకు 0.4 కంటే తక్కువ ఇండెక్స్ స్కోరుతో దిగువ 30శాతం దేశాల జాబితాలో ఉన్నది. అలాగే యూఎస్ఏ 0.8 కంటే తక్కువ ఇండెక్స్ స్కోరుతో టాప్ 50 శాతం దేశాల జాబితాలో ఉన్నది.
పరిశోధన, బోధించే స్వేచ్ఛ, విద్యా మార్పిడి మరియు వ్యాప్తి స్వేచ్ఛ, విశ్వవిద్యాలయాల సంస్థాగత స్వయంప్రతిపత్తి, విద్యా మరియు సాంస్కృతిక వ్యక్తీకరణ మరియు క్యాంపస్ సమగ్రత లేదా క్యాంపస్లో భద్రాతా ఉల్లంఘనలు మరియు నిఘా లేకపోవడం వంటి సూచికలను ఇండెక్స్ స్కోరుకు ఉపయోగించారు.
యూనివర్సిటీ స్వయంప్రతిపత్తి పడిపోవడం ద్వారా భారత్లో విద్యా స్వేచ్ఛ 2009 నుంచి పడిపోవడం ప్రారంభించింది. 2013 నుంచి పైన పేర్కొన్న అన్ని సూచికల్లో క్షీణతను నమోదు చేశాయి. 2014లో కేంద్రంలో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాని అయ్యాక ఈ ధోరణి కొనసాగటం గమనార్హం. విద్యావేత్తల భావప్రకటనా స్వేచ్ఛపై పరిమితులు, సంస్థాగత స్వయంప్రతిపత్తిపై ఒత్తిడి వంటివి ఇతర దేశాలతో పోల్చినపుడు భారత్లో ఉన్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
మోడీ హిందూ జాతీయవాద ప్రభుత్వం హయాంలో విద్యా స్వేచ్ఛపై దాడులు జరిగాయనీ, తగిన న్యాయప్రక్రియ లేకపోవడం వల్లనే అది సాధ్యమైంది. స్వేచ్ఛ లేకపోతే యూనివర్సిటీలు పరిశోధనల సరిగ్గా జరగవనీ, సమాజంలో విద్యావేత్తలు వారి పాత్రను పూరించలేరని, విద్యార్థులు స్వతంత్ర ఆలోచనలను పెంపొందించుకోలేరని ఫ్రీడ్రిచ్ అలెగ్జాండర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కత్రిన్ కిన్జెల్బాచ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, స్కాలర్లకు కావాల్సినంత స్వేచ్ఛను ఇవ్వాలనీ నిపుణులు సూచించారు. బీజేపీ సర్కారు తన సిద్ధాంతాన్ని విద్యాసంస్థలపై రుద్దాలని ప్రయత్నిస్తున్న తీరు దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని అన్నారు.