Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీతం లేని వారి పనిగంటలు..రోజుకు1640 కోట్లు
న్యూఢిల్లీ : మహిళలు వారి కుటుంబ పనుల నిమిత్తం చేస్తున్న శ్రమ, కార్మికరంగంలో వినియోగిస్తే...ఆ శ్రమ విలువ రూ.22.7 లక్షల కోట్లు ఉంటుందని, దేశ జీడీపీలో 7.5శాతానికి సమానమని ఎస్బీఐ ఒక నివేదికలో పేర్కొంది. ఇంటి పనుల కోసం వారు పడుతున్న శ్రమ వెలకట్టలేనిదని, బయటకి 'కనిపించని శ్రమ'గా లెక్కలోకి రావటం లేదని నివేదిక అభిప్రాయపడింది. మహిళల 'అన్‌పెయిడ్' పనిగంటలపై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 64 దేశాల్లోని మహిళల 'అన్‌పెయిడ్' శ్రమను లెక్కించే ప్రయత్నం చేసింది. వారంతా ఒకరోజు 'అన్‌పెయిడ్' పనిగంటలు 1640 కోట్లు ఉన్నాయని ఐఎల్వో వివరించింది.
భారత్‌లోని మహిళల 'అన్‌పెయిడ్' పనిగంటలపైనా ఎస్బీఐ కీలక విషయాలు విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థలో వారికి ప్రాతినిథ్యం దక్కితే ఆ ప్రభావం ఏమేరకు ఉంటుంది? అన్నది తెలుసుకోవటమే తమ నివేదిక ముఖ్య ఉద్దేశమని ఎస్బీఐ వివరించింది. జనవరి-డిసెంబర్ 2019 ఎన్ఎస్ఎస్ గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించామని పరిశోధకులు తెలిపారు.గృహసంబంధ పనుల్లో మహిళల శ్రమను వెలకట్టేందుకు తాము ప్రయత్నించామని ఎస్బీఐ వివరించింది. ఇంటి పనుల కోసం చేసిన శ్రమను...ఒక మహిళ మరో ఇంటి వద్ద ఉపయోగిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు కనీసం రూ.5వేలు ఆదాయం వస్తుందని, పట్టణాల్లో కనీసం రూ.8వేలు వస్తుందని నివేదిక అంచనావేసింది. వారి పనిగంటల విలువ రూ.22.7 లక్షల కోట్లు ఉంటుందని అంచనాకట్టింది. మహిళలు చేస్తున్న 'అన్‌పెయిడ్' శ్రమ సగటున ప్రతిరోజూ 7.2గంటలుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం పెరగాలని, కార్మికరంగంలో వారి శ్రమకు తగిన ఫలితం రావాలన్నదే తమ అధ్యయనం ముఖ్య ఉద్దేశమని ఎస్బీఐ తెలిపింది.