Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పుత్రరత్నం
బెంగళూరు : బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టలు పట్టుబడటం సంచలనం కలిగించింది. టెండరు ఇప్పిస్తానంటూ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ కెఎస్‌డిఎల్ కార్యాలయంలో కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు లోకా యుక్త అవినీతి నిరోదక విభాగానికి పట్టుబడ్డాడు. బీజేపీ ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప ప్రముఖ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్‌లను తయారు చేసే కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కెఎస్‌డిఎల్)కి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సబ్బులు, ఇతర డిటర్జెంట్లు తయారీకి అవసరమైన ముడిసరుకు కోసం కాంట్రాక్ట్ ఇచ్చేందుకు విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదల్ 40 శాతం కమిషన్‌ను డిమాండ్ చేయగా, కాంట్రాక్టర్ 30 శాతానికి ఒప్పందం కుదుర్చుకుని లోకాయుక్తకు సమాచార మిచ్చాడు. దీంతో, గురువారం సాయంత్రం ప్రశాంత్ పట్టుబడినట్లు కర్నాటక లోకాయుక్త బిఎస్ పాటిల్ తెలిపారు. ఎమ్మెల్యే నివాసంలో జరిపిన సోదాల్లో రూ.6.10 కోట్లు, అతని కార్యాలయంలో రూ.2.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత్‌ను 14రోజుల జ్యుడీషియల్ క్టసడీకి బెంగళూరులోని లోకాయుక్త కోర్టు పంపించింది. ప్రశాంత్ బెంగళూరు నీటి సరఫరా, మురుగు నీటి బోర్డు (బిడబ్ల్యుఎస్ఎస్బి)లో చీఫ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. అవినీతి వెలుగు చూడటంతో కెఎస్‌డిఎల్ ఛైర్మన్ పదవికి విరూపాక్షప్ప రాజీనామా చేశారు. ఇప్పటికే 40 శాతం కమిషన్లు అంటూ కర్నాటక సీఎం బొమ్మై సహా పలువురు బీజేపీ నేతలు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన నేపథ్యంలో విరూపాక్షప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది.