Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెగాసస్‌ను వినియోగించిన మోడీ ప్రభుత్వం
- నాతో పాటు రాజకీయ నాయకులందరి పైనా నిఘా
- నిర్బంధంలో పత్రికా స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ, మైనారిటీలపై దాడులు
- కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లెక్చర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని అన్నారు. తనతో పాటు అనేక మంది రాజకీయ నాయకులపై నిఘా ఉన్నదని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం పెగాసస్‌ను ఉపయోగిస్తున్నదని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నాయకులు, భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మాజీ సలహాదారు అయిన శామ్ పిట్రోడా ట్విట్టర్లో షేర్ చేశారు.
ఇజ్రాయిల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ తనతో పాటు అనేక మంది రాజకీయ నాయకుల ఫోన్లలో ఇన్స్టాల్ అయినట్టు రాహుల్ గాంధీ ఆరోపించారు. నా ఫోన్లోనూ పెగాసస్ ఉన్నదనీ, ఈ విషయంలో కొందరు నిఘా అధికారులు నన్ను పిలిచి జాగ్రత్తగా ఉండాలనీ, ఫోన్లో తానేమీ మాట్లాడినా రికార్డింగ్ చేస్తున్నామని చెప్పారని రాహుల్ అన్నారు.
ప్రజాస్వామ్యానికి కావాల్సిన సంస్థాగత ప్రక్రియ పార్లమెంట్, పత్రికా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ వంటివి నిర్బంధించబడుతున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణంపై దాడిని మనం ఎదుర్కొంటున్నామని తెలిపారు. భారత్ అనేది రాష్ట్రాల కలయిక అని రాజ్యాంగంలో పేర్కొనబడిందనీ, చర్చలు, సంభాషణలు అవసరమని అన్నారు. భారత్‌లో పత్రికలు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తనపై అనేక సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అన్నారు. మీడియా, ప్రజాస్వామ్య నిర్మాణంపై ఇలాంటి దాడి జరుగుతున్నపుడు ఒక ప్రతిపక్ష నేతగా ప్రజలతో ఆలోచనలు పంచుకోవడం చాలా కష్టమని రాహుల్ తెలిపారు.