Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు ఏడాదికిపైగా వేతన బకాయిలు
- ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా
- మీడియా సమావేశంలో గోడు వెళ్లబోసుకున్న 'నరేగా' కార్మికులు
- ఉపాధి హామీ రాజ్యాంగ హక్కు : బృందాకరత్
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) ద్వారా కోట్లాది మంది పేదలు ఉపాధి పొందుతున్నారు. అయితే ఉపాధి హామీ చట్టాన్ని మెల్లమెల్లగా నిర్వీర్యం చేసే వ్యూహాన్ని మోడీ సర్కార్ ఎంచుకుంది. కొత్త బడ్జెట్లో భారీ మొత్తంలో నిధులకు కోత విధించింది. ఇప్పటికే వేల కోట్ల బకాయిలు 'నరేగా' కింద రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాల్సివుంది. పశ్చిమ బెంగాల్లో పలు జిల్లాలో కార్మికులకు వేతన బకాయిలు ఏడాదికిపైగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నరేగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల ధర్నాకు దిగారు. ఈనేపథ్యంలో కార్మికులు నిర్వహించిన మీడియా సమావేశానికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ హాజరయ్యారు. ఉపాధి హామీ చట్టం..రాజ్యాంగ హక్కు. నరేగా పథకంపై మోడీ సర్కార్ అప్రకటిత యుద్ధం కొనసాగిస్తోందని అన్నారు.
ఆమె ఇంకా ఏమన్నారంటే..''దళితుల, ఆదివాసీల ఎన్నో సంవత్సరాల పోరాటంతో ఉపాధి హామీ చట్టం రూపొందింది. దీనిని వీలైనంతమేరకు నిర్వీర్యం చేయాలన్నదే కేంద్రం వ్యూహం. నరేగా, అటవీ హక్కుల చట్టాన్ని ఒక క్రమపద్ధతిలో కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. నరేగా కార్మికులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును తిరస్కరించేందుకు కేంద్రం వేయని ఎత్తుగడ లేదు. కేంద్ర బడ్జెట్లో 33 శాతం నిధులు తగ్గించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ఎంతోమంది పేదల్ని ఆదుకున్న పథకం నరేగా'' అని చెప్పారు. 2023-24 బడ్జెట్లో 'ఉపాధి హామీ' కోసం రూ.60వేల కోట్లు మాత్రమే కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం నిధుల ఖర్చు రూ.89వేల కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఉపాధి పనుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటే దాదాపు రూ.2.72 లక్షల కోట్లు అవసరం అవుతాయని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.
భారీగా వేతన బకాయిలు : బృందా కరత్
దేశంలో ఒక్క శాతం ధనికుల వద్ద 40శాతం వనరులున్నాయి. అయినా వారిపై అదనపు పన్ను వేయటం లేదు. మరోవైపు తమ వద్ద నిధులు లేవని, బడ్జెట్ లోటుందని కేంద్రం వాదిస్తోంది. చివరికి గ్రామీణ పేదలే బాధితులవుతున్నారు. ఉపాధి హామీ అమలుజేసిన 20 రాష్ట్రాల్లో వేతన బకాయిలు పేరుకుపోయాయి. అనేకమార్లు రాష్ట్రాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. అయినా కేంద్రం నుండి నిధులు సమయానికి విడుదల కాలేదు. ఉపాధి హామీ కార్మికుల్లో అత్యధికులు దళితులు, గిరిజనులు, మహిళలు. వీరి నుంచి పని తీసుకొని చెల్లింపులు నిలిపివేస్తున్నారు. ఇలా చేయటం నేరం. కార్మికులకు అత్యంత స్వల్ప వేతనాలు దక్కుతున్నాయి. దీనిని కూడా సవరించాలని మేం చాలా రోజులుగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.