Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారు బండ బాదుడు
- నాలుగేండ్లలో 56 శాతం పెరిగిన ధరలు
- సామాన్యులపై పెను భారం
సంపన్నులకు నజరానాలు ప్రకటిస్తూ.. సామాన్య,మధ్యతరగతి ప్రజల నడ్డిని మోడీ ప్రభుత్వం విరిచేస్తోంది. పెరగని ఆదాయాలకు తోడు ఉపాధి కరువై రోడ్డున పడుతున్న బడుగుల్ని ధరాభారాలతో పీల్చి పిండేస్తోంది..రష్యా నుంచి చౌకగా ముడి చమురు భారత్‌కు సరఫరా అవుతున్నా..చమురుధరల్ని తగ్గించటంలేదు. వంటగ్యాస్ ధరల్ని అమాంతంగా పెంచేసి ప్రజల జేబులు లూటీ చేస్తోందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
న్యూఢిల్లీ : ఈశాన్యంలో మూడు రాష్ట్రాల ఎన్నికలు ముగియడమే ఆలస్యం.. మోడీ సర్కారు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌పై ఇటీవల రూ. 50 పెంచి దేశంలోని సామాన్యులపై భారం మోపిన విషయం తెలిసిందే. దీంతో ఈ సిలిండర్ ధరలు రూ. 1103కు చేరుకున్నాయి. గతంలోనూ మోడీ సర్కారు ఎల్పీజీ సిలిండర్ ధరలను అనేక సార్లు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. ముఖ్యంగా మోడీ సర్కారు కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల మోత ఎక్కువైంది. గత నాలుగేండ్లలోనే గ్యాస్ సిలిండర్ ధరలు 56 శాతం పెరిగాయి.
గత నాలుగేండ్ల ధరలను చూసుకుంటే.. 2019, ఏప్రిల్ 1 నాటికి గృహ అవసరాలకు వినియోగించి ఎల్పీజీ సిలిండర్ (14.2కేజీలు) ధర రూ. 706.50గా ఉన్నది. అది 2020లో రూ. 744కు పెరిగింది. అలాగే, 2021లో రూ. 809, 2022లో రూ. 949.50కి పెంచింది మోడీ సర్కారు. ఆ తర్వాత ఈ నెల 1న కేంద్రం రూ. 50 పెంచడంతో గ్యాస్ ధరలు రూ. 1053 నుంచి రూ. 1103కు చేరుకు న్నాయి. నాలుగేండ్లలో మోడీ సర్కారు బాదుడుతో సిలిండర్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
ఒకవైపు ధరలను పెంచిన మోడీ సర్కారు.. ఇంకోపక్క సబ్సిడీ పైనా కోతలు విధించి దేశంలోని సామాన్యుడిని ఊపిరిసల్పనీయకుండా చేసింది. గత కొన్నేండ్లలో గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ గణనీయంగా తగ్గిందని సాక్షాత్తు ప్రభుత్వ గణాంకాలే వెల్లడించాయి. సబ్సిడీపై గత నాలుగేండ్ల సమాచారం ప్రకారం.. 2018-19లో సబ్సిడీ రూ. 37,209 కోట్లుగా ఉన్నది. అది 2019-20లో రూ. 24,172 కోట్లకు తగ్గింది. అలాగే, 2020-21లో రూ. 11,896 కోట్లకు, 2021-22లో రూ. 1811 కోట్లకు సబ్సిడీ మొత్తం పడిపోయింది.
ఎల్పీజీ సిలిండర్లపై ధరలను పెంచి.. సబ్సిడీని తగ్గించిన మోడీ సర్కారుపై దేశంలోని సామాన్య జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను అదుపు చేయాలనీ, సబ్సిడీని పెంచాలని డిమాండ్ చేశారు. అయితే, ఎప్పటి లాగే మోడీ సర్కారు ఈ ధరల పెరుగుదలకు కారణం అంతర్జాతీయ మార్కెట్లో ధరలను కారణంగా చూపెట్టడం గమనార్హం.దేశీల ఎల్పీజీ అమ్మకాలపై ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టాలను చవి చూశాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నష్టాలను పూడ్చేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ.22,000 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం ఇటీవల ఆమోదించడం గమనార్హం.
వంటగది బడ్జెట్ పై ప్రభావం 2014 నుంచి 2023 వరకు
సిలిండర్‌పై పెరిగిన రూ.693
2014 తర్వాత ఇలా భారాలు (ఢిల్లీలో ధర)
1 మార్చి 2014 రూ 410.50
1 మార్చి 2015 రూ 610
1 మార్చి 2016 రూ 513.50
మార్చి 1, 2017 రూ 735.50
1 మార్చి 2018 రూ 689
మార్చి 1, 2019 రూ 701.50
మార్చి 1, 2020 రూ 805.50
1 మార్చి 2021 రూ 819
1 మార్చి 2022 రూ 899
1 మార్చి 2023 రూ 1103
గ్యాస్ పంపిణీ సంస్థలు వంట గ్యాస్ ధరలను తాజాగా పెంచడానికి ముందు, (జులై 2022లో) దాని ధర రూ.1,053కి పెరిగింది. అయితే, ఈ సమయంలో ఎన్నికలు రావటంతో.. గ్యాస్ ధరలు కూడా తగ్గించింది. కానీ గణాంకాల ప్రకారం, దాని ధరలు చాలా తరచుగా పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర మహానగరాల్లో ఎల్పీజీ వంట, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వెయ్యికి పైనే ఉన్నాయి.