Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
- రాజకీయాలకు అస్త్రంలా గవర్నర్ వ్యవస్థ
- దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనం.. : ప్రధాని మోడీకి ప్రతిపక్షాల లేఖ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ మేరకు ప్రధాని మోడీకి ప్రతిపక్షాలు లేఖ రాశాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (బీఆర్ఎస్), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(టీఎంసీ), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(ఆప్), బీహార్ మంత్రి తేజస్వి యాదవ్(ఆర్జేడీ), జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ),కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (ఎన్సీపీ), మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (శివసేన), ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ)లు ప్రధాని మోడీకి సంయుక్తంగా లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందనీ, ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వమేనని విమర్శించారు. భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమేనని నమ్ముతున్నామనీ, ప్రజాతీర్పును గౌరవించాలని ప్రతిపక్ష నేతలు లేఖలో పేర్కొన్నారు. ''భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశమని మీరు అంగీకరిస్తారని మేం ఆశిస్తున్నాం. ప్రతిపక్ష నేతలపై కేంద్ర సంస్థల దుర్వినియోగం మనం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశ పాలనకు మారినట్లు సూచిస్తోంది. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అక్రమాలకు సంబంధించి అరెస్టు చేసింది. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయ కుట్రతో కూడినవి. అతని అరెస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. ఢిల్లీ పాఠశాల విద్యలో సంస్కరణలు తెచ్చిన సిసోడియా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అతని అరెస్టు ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ కక్షకు ఉదాహరణగా పేర్కొనబడుతోంది. నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ముప్పుగా ఉన్నాయని ప్రపంచం భావిస్తోంది'' అని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీలు దాడులు
''శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై 2014, 2015లో కాంగ్రెస్ మాజీ సభ్యుడు, ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై సీబీఐ, ఈడీ విచారణ జరిపాయి. ఆయన బీజేపీలో చేరిన తరువాత కేసు పురోగతి సాధించలేదు. మాజీ టీఎంసీ నాయకుడు సువేందు అధికారి, ముకుల్ రారు నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఈడీ, సీబీఐ దృష్టిలో ఉన్నారు. అయితే వారు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరాక.. కేసులు పురోగతి సాధించలేదు. మహారాష్ట్రకు చెందిన నారాయణ్ రాణేతో సహా అనేక ఉదాహరణలు ఉన్నాయి. 2014 నుంచి ప్రతిపక్ష నేతలపై దాడులు, కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం వంటివి గణనీయంగా పెరిగాయి. లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ జనతా దళ్), సంజరు రౌత్ (శివసేన), ఆజం ఖాన్ (సమాజ్వాదీ పార్టీ), నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ (ఎన్సీపీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ)లపై కేసులు నమోదు, దాడులు జరిగాయి. కేంద్ర ఏజెన్సీలు తరచుగా కేంద్రంలోని పాలక వ్యవస్థ చేతిలో పని చేస్తున్నారనే అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. అనేక సందర్భాల్లో నమోదైన కేసులు, అరెస్టుల సమయాలు ఎన్నికల సమయానికి సమానంగా, రాజకీయ ప్రేరేపితమైనవిగా స్పష్టంగా తెలుస్తోంది. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమైన సభ్యులను లక్ష్యంగా చేసుకున్న తీరును చూస్తుంటే ప్రతిపక్షాలను రూపుమాపాలనే ఉద్దేశ్యంతో దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందన్న ఆరోపణకు బలం చేకూరుస్తోంది. మీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉపయోగించిందని ఆరోపించిన ఏజెన్సీల జాబితా కేవలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కే పరిమితం కాలేదు'' అని లేఖలో తెలిపారు.
''ఈ ఏజెన్సీల ప్రాధాన్యతలను తప్పుదారి పట్టించారని స్పష్టమైంది. అంతర్జాతీయ ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన నివేదిక ప్రకారం ఒక నిర్దిష్ట సంస్థలో పెట్టుబడుల అంశం బహిర్గతం కావడంతో ఎస్బీఐ, ఎల్ఐసీ తమ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.78,000 కోట్లకు పైగా నష్టపోయినట్టు నివేదించబడింది. ప్రజాధనం ప్రమాదంలో ఉన్నప్పటికీ సంస్థ ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ఏజెన్సీలను ఎందుకు ముందుకు తీసుకురాలేదు?'' అని విమర్శించారు.
గవర్నర్ల కార్యాలయాలు రాష్ట్ర పాలనకు విఘాతం
''మన దేశ ఫెడరలిజానికి వ్యతిరేకంగా యుద్ధం జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా గవర్నర్ల కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర పాలనకు విఘాతం కలిగిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తున్నారు.
ఇష్టానుసారం పాలనను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్లు బీజేపీయేతర ప్రభుత్వాలు నడుపుతున్న కేంద్రం, రాష్ట్రాల మధ్య విస్తృతమైన విభేదాలకు కేంద్రంగా మారారు. ఆయా రాష్ట్రాల స్ఫూర్తికి ముప్పు కలిగిస్తుందని'' ప్రస్తావించారు.
''కో-ఆపరేటివ్ ఫెడరలిజం...కేంద్రం వ్యక్తీకరణ లోపించినప్పటికీ రాష్ట్రాలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. దేశ ప్రజలు భారత ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్రను ప్రశ్నించడం ప్రారంభించారు. రాజ్యాంగబద్ధమైన కార్యాలయాలు, గవర్నర్ ఆఫీసు, కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2014 నుంచి ఈ ఏజెన్సీలను ఉపయోగిస్తున్న తీరు వారి ప్రతిష్టను దిగజార్చింది. ఏజెన్సీల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ ఏజెన్సీలపై భారత ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టమే అత్యున్నతమైనది. మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్నా ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని గౌరవించాలని'' అని లేఖలో పేర్కొన్నారు.